ఆదిదంపతుల క్షేత్రం

ఆదిదంపతుల క్షేత్రం
ఆదిదేవుడైన పరమశివుడు ... జగన్మాత అయిన పార్వతీదేవి నెలకొని వున్న క్షేత్రాలు పరమ పవిత్రమైనవిగా, మహిమాన్వితమైనవిగా అలరారుతున్నాయి. అలాంటి పుణ్యక్షేత్రాలలో ఒకటిగా మధ్యప్రదేశ్ లోని 'జబల్ పూర్' అలరారుతోంది. ప్రసిద్ధి చెందిన ఇక్కడి క్షేత్రాల్లో 'చౌసట్ యోగిని' ఆలయం ఒకటిగా అలరారుతోంది. ఇక్కడి ఆలయంలో ప్రాకార మంటపాల్లో 64 మంది యోగినీలు కొలువుదీరి కనిపిస్తారు. ఈ కారణంగానే ఈ ఆలయానికి 'చౌసట్ యోగిని' ఆలయం అనే పేరు వచ్చింది.

ఈ యోగినీ రూపాలు అద్భుతంగా మలచబడ్డాయి. మొఘల్ చక్రవర్తుల కాలంలో ఈ ఆలయంపై దాడులు నిర్వహించి, ఈ శిల్పాలను ధ్వంసం చేశారు. ఈ కారణంగా చాలా శిల్పాలు భిన్నమై కనిపిస్తుంటాయి. అయినా ఆనాటి శిల్పకళా వైభవానికి ఈ శిల్పాలు సజీవ సాక్ష్యాలుగా దర్శనమిస్తుంటాయి. 10 వ శతాబ్దంలో నిర్మించబడిన ఈ ఆలయం, ఆనాటి రాజుల శైవ భక్తిని ఆవిష్కరిస్తూ వుంటుంది.

అపూర్వమైన ఇక్కడి నిర్మాణాలు సందర్శకులను అబ్బురపరుస్తుంటాయి. ఇక ఇక్కడి ప్రధాన విశేషం ఏమిటంటే, గర్భాలయంలోని శివపార్వతులు నంది వాహనాన్ని అధిరోహించి కనిపిస్తుంటారు. నంది వాహనంపై ముందువైపున కూర్చున్న శివుడు, వెనక కూర్చున్న పార్వతీదేవి వైపు తిరిగి ఏదో మాట్లాడుతున్నట్టుగా కనిపిస్తుంటాడు. ఆదిదంపతుల అన్యోన్యతకు ఈ దృశ్యం అద్దం పడుతూ వుంటుంది.

ఓ మహర్షి తపస్సుకు మెచ్చి ఆయన అభ్యర్ధన మేరకు స్వామివారు ఈ రూపంలో ఆవిర్భవించినట్టు స్థలపురాణం చెబుతోంది. మనోహరమైన ఈ మూలమూర్తిని దర్శించడం వలన, వివాహ సంబంధమైన సమస్యలు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తుంటారు. విశేషమైన పర్వదినాల్లో అధిక సంఖ్యలో భక్తులు ఇక్కడికి వస్తుంటారు ... ఆ స్వామి సేవా భాగ్యాన్ని పొందుతూ తరిస్తుంటారు.

More Bhakti Articles