ఆపద్బాంధవుడి ఆలయం

ఆపద్బాంధవుడి ఆలయం
సృష్టిలోని ప్రతి జీవరాశికి ఆహరమివ్వడం ... అభయమివ్వడం ఆ దేవదేవుడికే సాధ్యమవుతుంది. అన్ని జీవరాసులకు ఆయనే ఆదిదేవుడు ... ఆయనే ఆపద్బాంధవుడు. సమస్త దేవతలు కూడా ఆయనని ఆపద్బాంధవుడిగానే కీర్తిస్తుంటారు ... అంకిత భావంతో ఆరాధిస్తుంటారు. అలా ఆయన ఆపద్బాంధవుడిగా పిలవబడుతోన్న క్షేత్రం తమిళనాడు - కుంభకోణం సమీపంలో అలరారుతోంది.

అత్యంత ప్రాచీనమైన ఈ క్షేత్రం ఆనాటి వైభవానికి ప్రతీకగా కనిపిస్తూ వుంటుంది. ఎంతోమంది మహనీయులు ఇక్కడి స్వామిని సేవించి తరించిన ఆధారాలు వున్నాయి. దేవదానవులు క్షీరసాగర మథనం చేసినప్పుడు వచ్చిన విషాన్ని శివుడు తన కంఠంలో దాచాడు. అలా ఆయన సమస్త లోకాలను ఆ విష ప్రభావం నుంచి బయటపడేసిన ప్రదేశం ఇదేనని అంటారు. ఈ కారణంగానే ఇక్కడి స్వామిని 'ఆపద్బాంధవుడు'గా కొలుస్తుంటారు.

ఇక ఈ ప్రదేశంలోనే దేవదానవులకు పరమశివుడు జ్ఞానబోధ చేసిన కారణంగా ఆయనని 'దక్షిణామూర్తి' అని కూడా పిలుస్తుంటారు. ఈ ప్రాంతానికి చెందిన భక్తులు ... ముఖ్యంగా విద్యార్ధినీ విద్యార్ధులు స్వామిని గురువుగా భావించి భక్తి శ్రద్ధలతో పూజిస్తుంటారు. ఇక్కడి స్వామిని దర్శించడం వలన గురుగ్రహ సంబంధమైన దోషాలు తొలగిపోతాయని అంటారు.

గురు సంబంధమైన పర్వదినాల్లోను ... దైవ సంబంధమైన పర్వదినాల్లోను ఇక్కడికి వచ్చే భక్తుల సంఖ్య అధికంగా వుంటుంది. అన్ని వర్గాలకి చెందిన భక్తులు స్వామివారి అనుగ్రహాన్ని ఆశిస్తూ కానుకలు సమర్పిస్తుంటారు. ఆపదలో ఉన్నవారిని స్వామి ఆపద్బాంధవుడిగా ఆదుకుంటాడనీ, గురువుగా పూజించిన విద్యార్ధినీ విద్యార్ధులకు ఉన్నతమైన స్థానాన్ని అనుగ్రహిస్తాడని భక్తులు విశ్వసిస్తుంటారు.

More Bhakti Articles