నిర్మాల్య పుష్పాలను ఏం చేయాలి?

నిర్మాల్య పుష్పాలను ఏం చేయాలి?
పూజ ... అనగానే ప్రతి ఒక్కరికి పువ్వులు గుర్తుకు వస్తాయి. పువ్వులు దేవుడి కోసమే పూశాయని అందరూ భావిస్తుంటారు కనుక, అవి లేకుండా ఎవరూ పూజ చేయరు. పువ్వులు లేకుండా చేసిన పూజకి ఫలితం కూడా వుండదు. పువ్వులతో ఇష్టదైవానికి అలంకరణ చేసి, మిగతా పువ్వులను ఆ దైవం పాదాల చెంత సమర్పించడం వల్లనే పరిపూర్ణమైన ఫలితం దక్కుతుందని అంతా విశ్వసిస్తుంటారు.

అయితే మరునాడు ఉదయం ఆ పువ్వులను ఏం చేయాలనే విషయంలో చాలామంది సతమతమైపోతుంటారు. కొంతమంది ఆ పువ్వులు ఇంకా సువాసనలు వెదజల్లుతూనే ఉన్నాయనీ, ఇంకా వాడలేదని చెప్పి వాటినే వుంచి పూజాభిషేకాలు నిర్వహిస్తుంటారు. అయితే ఎంతటి సువాసనలు వెదజల్లే పువ్వులతో పూజించినా, మరునాడు ఉదయానికి అవి వాడకపోయినా తప్పకుండా నిర్మాల్య పుష్పాలను తీసివేయాలని శాస్త్రం చెబుతోంది.

ముఖ్యంగా నగరాలకి సంబంధించి పూజా మందిరం నుంచి తీసిన పువ్వులను చాలా మంది చెత్తబుట్టలో వేసేస్తుంటారు. అలా చెత్తబుట్టలో వేసిన నిర్మాల్య పుష్పాలు ... చెత్తను తీసుకు వెళ్లే వాళ్ల ద్వారా చెత్తబండిలోకి చేరతాయి. ఆ తరువాత అవి మరింత మలినమైన ప్రదేశాలకి చేరుకుంటాయి. దేవుడికి సమర్పించబడిన పువ్వులకి ఈ పరిస్థితి రావడం దోషానికి కారణమవుతుందని శాస్త్రం చెబుతోంది.

నిర్మాల్య పుష్పాలను ఎలాంటి పరిస్థితుల్లోను చెత్తబుట్టలో వేయకూడదు. దేవుడికి సమర్పించబడిన ఈ పువ్వులను మొక్కల మొదళ్లలో గానీ, లేదంటే పూలకుండీల్లో గాని వేయవచ్చు. వీలైతే ప్రతిరోజు క్రితం రోజు నాటి నిర్మాల్యాలను ఓ సంచీలో వుంచి. రెండు మూడు రోజులు కాగానే ప్రవాహంలో నిమజ్జనం చేయవచ్చు. ఈ విధంగా చేయడం వలన పువ్వుల పవిత్రత కాపాడబడుతుంది ... వాటితో పూజ చేసిన ఫలితం పరిపూర్ణంగా లభిస్తుంది.

More Bhakti Articles