ప్రసాదంలో సందేశం!

 ప్రసాదంలో సందేశం!
సాధారణంగా ప్రతి దేవాలయంలోను పూజ పూర్తయిన తరువాత ప్రసాదం పంచిపెడుతూ వుంటారు. ప్రసాదం స్వీకరించడం వల్లనే దైవదర్శన ఫలితం పూర్తిగా దక్కినట్టుగా భావించడం జరుగుతూ వుంటుంది. దైవాన్ని బట్టి ... అక్కడి సంప్రదాయాన్ని బట్టి ఈ ప్రసాదాల తయారీ వుంటుంది. ఒక్కో క్షేత్రంలో ఒక్కో ప్రసాదం ప్రత్యేకతను ... విశిష్టతను సంతరించుకుని కనిపిస్తూ వుంటాయి.

ఈ నేపథ్యంలో భక్తులకి పులిహోర ... పొంగలి ... పెరుగన్నం ... పరమాణ్ణం ... లడ్డూలు ... వడలు ప్రసాదంగా లభిస్తూ వుంటాయి. సమస్త జీవులకు ఆహారాన్ని అందించేవాడు ఆ పరమాత్ముడే అనే ఆలోచన ప్రసాదాన్ని స్వీకరించే సమయంలో జనిస్తుంది. సుదూర ప్రాంతాలనుంచి దైవదర్శనం కోసం వచ్చి అలసిన భక్తుల ఆకలిని కొంతవరకూ తీర్చే ఉద్దేశం కూడా ప్రసాదాన్ని పంచడం వెనుక వుందని చెప్పుకోవచ్చు.

ఇక ఏ ప్రసాదం తయరుచేయాలన్నా ఎన్నోరకాల పదార్థాలు అవసరమవుతూ వుంటాయి. వాటినన్నింటినీ కలిపి తయారుచేయడం వల్లనే ప్రసాదానికి అంతటి రుచి వస్తుంటుంది. ఇలా తయారుచేయబడిన ప్రసాదాన్ని నైవేద్యం అనంతరం, ధనిక - పేద అనే తారతమ్యం లేకుండా అందరికీ ఒకేలా పంచడం జరుగుతూ వుంటుంది.

వివిధ రకాల పదార్ధాలతో తయారైన ప్రసాదం రుచిగా ఉన్నట్టే, అందరూ కలిసికట్టుగా వుంటే జీవితం ఆనందకరంగా ఉంటుందనే విషయాన్ని తెలుపుతోంది. ఇక ఒకేచోట కలిసి ఒకే ప్రసాదాన్ని స్వీకరించడం వలన, భగవంతుడి దృష్టిలో అందరూ ఒక్కటేననే భావన కలుగుతుంది. ఈ భావనే అందరిలో మార్పుకు కారణమై, సఖ్యతకు పునాదులు వేస్తుంది. కనుక ప్రసాదంలో భగవంతుడి అనుగ్రహంతో పాటు, ఆయన ఇచ్చే సందేశం కూడా ఉందనే విషయాన్ని మరిచిపోకూడదు.

More Bhakti Articles