సాయి సన్నిధానం

సాయి సన్నిధానం
ఆధ్యాత్మిక ప్రపంచాన్ని ప్రభావితం చేసిన అవధూతలు ఎందరో వున్నారు. ఆదర్శవంతమైన జీవితాన్ని గడుపుతూ, నిస్వార్ధమైన సేవలను అందించిన గురువులు ఎందరో వున్నారు. సమాజంలో శాంతిని ... సఖ్యతని ... సమానత్వాన్ని పెంపొందించడానికి వాళ్లంతా తమదైన శైలిలో కృషిచేశారు. అజ్ఞానంతో అవస్థలు పడుతోన్న వారిలో జ్ఞానమనే వెలుగులు నింపారు. అలాంటి వారిలో శ్రీ శిరిడీ సాయిబాబా ప్రధానంగా కనిపిస్తాడు.

'గురువు' అనే అనంతమైన ఆకాశం గురించి తెలుసుకోవాలనుకునే వారికి సాయి జీవితం ఒక పుస్తకంలా ఉపయోగపడుతుంది. తనని నమ్మినవారిని కాపాడటమే ధ్యేయంగా పెట్టుకున్న గురువు ... దైవంగా మారతాడనడానికి ఆయన జీవితమే నిదర్శనం. ఈ కారణంగానే నేడు ప్రతి వూరు .. ప్రతి హృదయం ద్వారకామాయిగా మారిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఆవిర్భవించినదే, హైదరాబాదు - ఫిలింనగర్లోని శ్రీ శిరిడీ సాయిబాబా మందిరం.

నగరంలో నిర్మితమైన సాయి మందిరాలలో ఈ మందిరం ముందువరుసలో కనిపిస్తుంది. విశాలమైన ప్రాంగణం ... ఆకర్షణీయమైన మంటపం ... వేల నమస్కారాలను అందుకునే వేదిక మనసును దోచుకుంటాయి. వేదికపై సాయి అనురాగామృతాన్ని వర్షింపజేస్తుంటాడు. అందరి బాధలను ... వ్యధలను సహనంతో వింటూ ఉంటాడు ... ధర్మబద్ధమైనవి నెరవేరుస్తూ ఉంటాడు. వేదికకి ఇరువైపులా గణపతి - దత్తాత్రేయుడు కొలువై వుంటారు.

శిరిడీలో మాదిరిగానే ఇక్కడ సాయికి హారతులు ... అభిషేకాలు ... ఉత్సవాలు జరుగుతుంటాయి. ఇదే ప్రాంగణంలో సీతారాములు ... శ్రీ సరస్వతీ దేవి ... శనేశ్వరుడు పూజలందుకుంటూ వుంటారు. ఆయా దైవాలకి సంబంధించిన పుణ్య తిథుల్లో ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు ... విశేష ఉత్సవాలు ఘనంగా జరుగుతుంటాయి. ఈ సందర్భంగా సాయి సన్నిధానంలో అడుగుపెట్టిన భక్తులు, సంతోషకరమైన ... సంతృప్తికరమైన జీవితాన్ని సొంతం చేసుకుంటూ వుంటారు.

More Bhakti Articles