ఆళ్వారులు

ఆళ్వారులు
వైష్ణవ ఆలయాలకి వెళ్లినప్పుడు అక్కడ ప్రత్యేక మందిరాల్లో ఆళ్వారులు దర్శనమిస్తుంటారు. క్షేత్ర ప్రాధాన్యతను బట్టి ... నిర్మాణ కాలాన్ని బట్టి ఆళ్వారుల మందిరాలు కనిపిస్తుంటాయి. ఒక్కో చోట ఆళ్వారులలో ఒకరు మాత్రమే కొలువై వుండగా, మరికొన్ని చోట్ల ఆళ్వారులులో ముఖ్యులంతా వరుసగా కనిపిస్తూ వుంటారు. ప్రాచీనకాలానికి చెందిన కొన్ని క్షేత్రాల్లో ఆళ్వారులు శిలా ప్రతిమలుగా దర్శనమిస్తుంటారు. వైభవంగల క్షేత్రాల్లో వీరు పంచలోహ మూర్తులుగా కొలువై వుంటారు.

వైష్ణవ ఆలయాలకి వెళ్లినప్పుడు చాలామంది ఆళ్వారులకి కూడా భక్తి శ్రద్ధలతో నమస్కరిస్తూ వుంటారు. అయితే వాళ్లు ఎవరో .. స్వామితో పాటుగా పూజలందుకోవడంలోని విశేషమేమిటో కొంతమందికి తెలియకపోవచ్చు. వైష్ణవ సంప్రదాయాన్ని ప్రచారం చేసిన విష్ణు భక్తులను 'ఆళ్వారులు' అని అంటారు. అలాగే శైవ సంప్రదాయాన్ని ప్రచారం చేసిన శివ భక్తులను 'నయనారులు' అంటారు.

ఆళ్వారులలో 12 మంది ముఖ్యులుగా చెప్పబడుతున్నారు. పూదత్తాళ్వారు ... పొయ్ గైయాళ్వారు ... పేయాళ్వారు ... పెరుయాళ్వారు ... ఆండాళ్ (గోదాదేవి) ... తిరుమళిశైయాళ్వారు ... కులశేఖరాళ్వారు ... తిరుప్పాణియాళ్వారు ... తొండరడిప్పొడియాళ్వారు ... తిరుమంగై యాళ్వారు ... మధురకవియాళ్వారు ... నమ్మాళ్వారు ఈ జాబితాలో కనిపిస్తారు.

వీరంతా కూడా వైష్ణవ సంప్రదాయాన్ని దశదిశలా వ్యాపింపజేశారు. స్వామిని అనేక విధాలుగా స్తుతిస్తూ ... కీర్తిస్తూ అనేక ప్రాంతాలను ప్రభావితం చేశారు. స్వామివారి పట్ల అసమానమైన భక్తిని ఆవిష్కరిస్తూ ... అనునిత్యం ఆయన సేవలో తరించారు ... ఆయనలోనే ఐక్యమైపోయారు. ఈ కారణంగానే వారికి స్వామి సన్నిధిలో కొలువై వుండే అదృష్టం దక్కింది. ఆయనతో పాటుగా నిత్యపూజలు అందుకునే భాగ్యం లభించింది.

More Bhakti Articles