రాముడు నడయాడిన క్షేత్రం

రాముడు నడయాడిన క్షేత్రం
రామ అనే శబ్దాన్ని వినని వాళ్లు ... రామాలయాన్ని చూడని వాళ్లు ఉండరనే చెప్పాలి. ఎందుకంటే రాముడు తన ఆదర్శవంతమైన వ్యక్తిత్వంతో సమస్త లోకాలను ప్రభావితం చేశాడు. తనని ఎవరూ విమర్శించని విధంగా ... తన వంశ గౌరవ మర్యాదలకు ఎలాంటి మచ్చరాని విధంగా రాముడు నడచుకున్నాడు. శ్రీమన్నారాయణుడి అవతారమైనప్పటికీ రాముడు ఎన్నడూ ఎలాంటి మహిమలు ప్రదర్శించకుండా, ఓ మానవుడిగానే నడచుకున్నాడు.

అలాంటి రాముడికి ఆలయంలేని గ్రామమంటూ కనిపించదు. రామాలయం ఎంత పవిత్రంగా అనిపిస్తుందో, రాముడి రూపం అంత ప్రశాంతంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఆవిర్భవించిన రామాలయాలలో హైదరాబాద్ లోని బి.హెచ్.ఇ.ఎల్ ఒకటి. ఇక్కడి ఆలయంలో రాముడు సీతా సమేతంగా, లక్ష్మణ .. హనుమ సహితంగా దర్శనమిస్తుంటాడు.

రాజగోపురం ... ప్రాకారాలు ... ముఖమంటపం ... చూడముచ్చటగా కనిపిస్తూ వుంటాయి. అయితే గోల్కొండ నవాబు బందీగా వున్న కంచర్ల గోపన్నను విడిపించడానికి వచ్చిన రామలక్ష్మణులు, ఈ ప్రదేశం నుంచే అక్కడికి బయలుదేరారని అంటారు. ఆ కారణంగా ఈ ప్రదేశానికి ఎంతో విశిష్టత ఏర్పడింది.

స్థల మహిమ ... శ్రీ రాముడు సేవా భాగ్యం కారణంగా భక్తులు అధిక సంఖ్యలో ఇక్కడికి వస్తుంటారు. శ్రీరామనవమి ఉత్సవాలు ఇక్కడ ఘనంగా జరుగుతుంటాయి. ఈ సందర్భంగా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా భక్తులు వస్తుంటారు. కళ్యాణోత్సవంలో పాల్గొని స్వామివారికి కానుకలు సమర్పిస్తుంటారు.

More Bhakti Articles