కరవది

కరవది
కలియుగంలో గురువులపై గురి కుదరడం అంత తేలికైన విషయం కాదు. తమని విశ్వసించమని కొంతమంది గురువులు చెబుతున్నా కొద్దీ, జనం వారికి దూరమైపోతుంటారు. ఇక రమణ మహర్షి ... రామకృష్ణ పరమహంస వంటి వారు, తాను గురువునని ఎవరైతే భావించరో, వారే నిజమైన గురువు అని చెప్పారు.

ఇక ఎవరైతే తమ చుట్టూ వున్న వారి బాధలను తమవిగా భావిస్తారో, వారి బాగు కోసం నిస్వార్ధంగా కృషి చేస్తూ ఆధ్యాత్మిక మార్గంలో నడిపిస్తారో వారే నిజమైన గురువు అని మరికొందరు మహనీయులు సెలవిచ్చారు. ఇలాంటి నిర్వచనాలన్నీ శిరిడీ సాయిబాబా విషయంలో అతికినట్టుగా సరిపోతాయి.

తాను గురువుననీ గానీ ... తనని పూజించమని గాని ఎవరికీ చెప్పకుండానే, కేవలం ప్రేమే ఆయుధంగా కోట్లాది ప్రజల హృదయాలను దోచిన ఘనత శిరిడీ సాయిబాబా సొంతం. ప్రపంచ వ్యాప్తంగా ఆవిర్భవిస్తున్న సాయి మందిరాలన్నీ ఆయన అపారమైన ప్రేమకు ప్రతిరూపాలే. అలాంటి సాయి మందిరాలలో ఒకటి ప్రకాశం జిల్లాలోని 'కరవది'లో దర్శనమిస్తుంది.

త్రేతాయుగంలో ఈ ప్రదేశం శ్రీరాముడి పాద ధూళిచే పవిత్రమైనట్టు స్థలపురాణం చెబుతోంది. అలాంటి ఈ ప్రదేశంలో ఆవిర్భవించిన సాయి మందిరం మరింత విశిష్టమైనదిగా వెలుగొందుతోంది. చక్కని నగిషీలతో అందంగా తీర్చిదిద్దిన సాయి మందిరం, తొలి చూపులోనే మనసును దోచేస్తుంది. గర్భాలయం పై గల విమాన నిర్మాణ శైలి కూడా ఆనందాశ్చర్యాలకు గురిచేస్తుంది. ఇక వేదికపై గల సాయి విగ్రహం, కరుణామృతాన్ని కురిపిస్తూ కనిపిస్తుంది. చెరో వైపున గణపతి ... దత్తాత్రేయుడు కొలువై పూజలు అందుకుంటూ వుంటారు.

ప్రతి నిత్యం సాయికి పూజాభిషేకాలు ... హారతులు నిర్వహిస్తుంటారు. ప్రతి గురువారం భజనలు ... పారాయణాలు ... కోలాటాలు ... పల్లకీ సేవ వైభవంగా జరుపుతుంటారు. పర్వదినాల్లో ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య అధికంగా వుంటుంది. ఇక్కడి సాయిని ఆరాధించడం వలన సకల శుభాలు కలుగుతాయని భక్తులు అనుభవ పూర్వకంగా చెబుతుంటారు.

More Bhakti Articles