నాగదోష నివారణ క్షేత్రం

నాగదోష నివారణ క్షేత్రం
నాగదోషం ఉందనగానే చాలామంది నానా కంగారు పడిపోతుంటారు. దోషానికి పరిహారం చేసుకోవడానికి అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు. ఖర్చుకి వెనుకాడకుండా ఈ దోషం నుంచి బయటపడాలని ఆరాటపడుతుంటారు. ఇందుకోసం వివిధ పుణ్యక్షేత్రాలను కూడా దర్శిస్తూ వుంటారు. ఈ నేపథ్యంలో అందరికీ ఆశాకిరణంలా కనిపించే క్షేత్రం ఒకటి వుంది ... అదే సుబ్బరాయకొత్తూరు.

కర్నూలు జిల్లాలోని ఈ క్షేత్రంలో సుబ్రహ్మణ్యస్వామి సర్పాకారంలో దర్శనమిస్తూ వుంటాడు. పన్నెండు పడగలు గల సర్పరాజంలా సుబ్రహ్మణ్య స్వామి ఇక్కడ భక్తులచే పూజలు అందుకుంటూ ఉంటాడు. ఇది మహిమాన్వితమైన ప్రదేశమనీ, ఈ కారణంగానే స్వామి ఇక్కడ స్వయంభువుగా ఆవిర్భవించాడని అంటారు.

స్వామి కొలువుదీరిన మందిరం గ్రామదేవతల మాదిరిగా ఆరుబయట వుండటం విశేషం. పూర్వం ఒక భక్తుడి కలలో స్వామి కనిపించి, తాను ఇక్కడ కొలువై ఉన్నట్టుగా చెప్పాడట. ఆ ఆనవాళ్ల ప్రకారం స్వామి జాడ తెలుసుకుని ప్రతిష్ఠించడం జరిగింది. ఆనాటి నుంచి స్వామికి నిత్యపూజలు జరుగుతున్నాయి. భక్తులు స్వయంగా స్వామికి అభిషేకం చేసుకునే అవకాశం వుంది.

ఇక్కడి స్వామిని పంచామృతాలతో అభిషేకించి ఆరాధించడం వలన, నాగదోషం తొలగిపోతుందని అంటారు. ఈ కారణంగా నాగదోషం గల వాళ్లు ఈ క్షేత్రానికి ఎక్కువగా వస్తుంటారు. స్వామి అనుగ్రహంతో దోషం నుంచి బయటపడ్డామని భావించిన వాళ్లు, తలనీలాలను మొక్కుబడిగా చెల్లిస్తుంటారు. ఇక విశేషమైన పర్వదినాల్లో ఇక్కడికి వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతూ వుంటుంది.

More Bhakti Articles