భక్తులకి శ్రీరామరక్ష

భక్తులకి శ్రీరామరక్ష
శ్రీరాముడు తనని నమ్మిన వారి వెన్నంటి ఉంటూ అనుక్షణం వాళ్లని కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటాడని భక్తులు విశ్వసిస్తూ వుంటారు. అందువల్లనే ఆపదవేళలో తమకి శ్రీరామరక్ష వుండాలని అంతా కోరుకుంటూ వుంటారు. నిస్వార్ధ భక్తితో తనని సేవించిన వారిని శ్రీరాముడు రక్షిస్తాడనడానికి ఉదాహరణగా త్యాగయ్య జీవితంలో జరిగిన ఒక సంఘటన కనిపిస్తుంది.

అపారమైన త్యాగయ్య భక్తి గురించి ఊరూరా పాకిపోతుంది. త్యాగయ్య పేరు ప్రతిష్ఠలను భరించలేని అన్నావదినలు, ఆయన నిత్యం పూజించుకునే సీతారాముల విగ్రహాలను కాజేస్తారు. అర్ధరాత్రివేళ ఆ పనిచేసిన దంపతులు, అది దొంగలపనిగా ఊళ్లోవాళ్లని నమ్మిస్తారు. శ్రీరాముడు లేని ఇంట్లో తాను వుండలేనంటూ, ఆ విగ్రహాలను వెతుకుతూ బయలుదేరుతాడు త్యాగయ్య. పసుపు ముద్దలనే సీతారాములుగా భావించి పూజిస్తూ, భర్తకోసం ఆయన తెచ్చే సీతారాముల ప్రతిమల కోసం త్యాగయ్య భార్య ఎదురుచూస్తూ వుంటుంది.

విగ్రహాలను వెతికే ప్రయత్నంలో భాగంగా త్యాగయ్య ఒకచోట మజిలీచేస్తాడు. ఆ సమయంలోనే ఆయనకి కలలో రాముడు కనిపించి సొంత ఊరుకి చేరుకొని శ్రీరామనవమి ఉత్సవాలకు ఏర్పాట్లు చేయమని చెబుతాడు. దాంతో తన శిష్యుడిని వెంటబెట్టుకుని బయలుదేరుతాడు త్యాగయ్య. ఆయనని ఎంతగానో అభిమానించే ఒక వ్యక్తి పల్లకీని ఏర్పాటు చేస్తాడు. పల్లకీ అడవీమార్గంలో వస్తుండటాన్ని కొండపై నుంచి బందిపోటు దొంగలు చూస్తారు.

బోయలను చెల్లాచెదురు చేయడం కోసం కొండపై నుంచి బండరాళ్ళను దొర్లిస్తారు. పల్లకీ వైపు దొర్లుకుంటూ వెళ్ల వలసిన బండరాళ్లను, ఆకాశం నుంచి దూసుకువచ్చిన బాణాలు అడ్డుకుంటూ వుంటాయి. ఆకాశం వైపు చూసిన దొంగలకు ధనుర్బాణాలు ధరించిన ఇద్దరు వ్యక్తులు కనిపిస్తారు.

వారి బాణాల ధాటికి తట్టుకోలేక దొంగలంతా వెళ్లి త్యాగయ్య పాదాలపై పడ్డారు. ఇకనుంచి తాము దొంగతనాలు మానేస్తున్నట్టుగా చెప్పి, మన్నించమంటూ వేడుకుంటారు. జరిగింది తెలుసుకున్న త్యాగయ్య,వారికి రామలక్ష్మణుల దర్శనభాగ్యం లభించిందంటూ ఆనందాన్ని వ్యక్తం చేస్తాడు. ఆ సీతారాముల అనుగ్రహంతో తప్పకుండా విగ్రహాలు తన ఇంటికి తిరిగి వస్తాయనే విశ్వాసంతో పల్లకీలో ముందుకుసాగుతాడు.

More Bhakti Articles