అరుదైన శైవ క్షేత్రం

అరుదైన శైవ క్షేత్రం
శత్రుభయం ... రుణభయం ... రోగభయం అందరినీ వెంటాడుతూ వుంటాయి. వీటి బారి నుంచి బయటపడటానికి అంతా దైవారాధన చేస్తుంటారు. వివిధ పుణ్యక్షేత్రాలను దర్శిస్తూ వుంటారు. అయితే ఇటువంటి భయాందోళనలకు లోనయిన వాళ్లు, 'జుత్తిగ' క్షేత్రాన్ని దర్శించుకుంటే మంచి ఫలితం కనిపిస్తుందని అంటారు. మహిమాన్వితమైన ఈ క్షేత్రం, పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండల పరిధిలో కనిపిస్తుంది.

పూర్వం రాక్షసుల ఆగడాలకు భూలోకంతో పాటు దేవలోకం ... నాగలోకం సైతం భయాందోళనలకు గురయ్యాయి. సూర్యచంద్రులు ... వాసుకీ కలిసి బ్రహ్మ దగ్గరికి వెళ్లారు. శత్రుభయ నాశనానికి ఏం చేయాలో చెప్పమని ఆయనని అడిగారు. భూలోకంలోని పవిత్రమైన ప్రదేశంలో, ఉత్తర వాహినిగా ప్రవహించే నదీ తీరంలో పశ్చిమాభి ముఖంగా శివలింగాన్ని ప్రతిష్ఠించమని బ్రహ్మ సూచించాడు. ఫలితంగా ఆవిర్భవించినదే 'జుత్తిగ' క్షేత్రం.

ఉమా వాసుకీ రవి సోమేశ్వరుడు కలిసి ప్రతిష్ఠించిన కారణంగానే ఇక్కడి శివలింగాన్ని'ఉమా వాసుకీ రవి సోమేశ్వరుడు 'గా కొలుస్తుంటారు. 15వ శతాబ్దంలో ఈ ఆలయం తిరిగి వెలుగులోకి వచ్చింది. ఎంతోమంది రాజులు ఆలయ అభివృద్ధికి తమవంతు కృషిచేశారు. విశాలమైన ప్రదేశం .. పొడవైన ప్రాకారాలు .. పవిత్రతకు ప్రతీకగా కనిపించే కోనేరు .. అద్భుతమైన రాజగోపురం ఆనాటి వైభవాన్ని అందంగా మన ముందుంచుతుంటాయి.

గర్భాలయంలో శివలింగం చక్కని పరిమాణంలో చూడచక్కగా దర్శనమిస్తూ వుంటుంది. ఆ పక్కనేగల ప్రత్యేక మందిరంలో పార్వతీదేవి పూజలందుకుంటూ వుంటుంది. ఇదే ప్రాంగణంలో లక్ష్మీజనార్ధన స్వామి .. వల్లీదేవసేన సుబ్రహ్మణ్య స్వామి .. సూర్యనారాయణమూర్తి .. కాలభైరవుడు .. నవగ్రహాలు ప్రత్యేక పూజలు అందుకుంటూ వుంటారు.

ఇక్కడి స్వామిని దర్శించుకోవడం వలన శత్రు భయమే కాకుండా, రుణ భయాలు - రోగ భయాలు కూడా తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తుంటారు. ప్రతియేటా మాఘ బహుళ దశమి నుంచి అమావాస్య వరకూ పార్వతీ పరమేశ్వరుల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్దసంఖ్యలో భక్తులు ఇక్కడికి వస్తుంటారు. ఉమాశంకరుల అనుగ్రహానికి పాత్రులవుతుంటారు.

More Bhakti Articles