విమాన వేంకటేశ్వరుడు

విమాన వేంకటేశ్వరుడు
సాక్షాత్తు ఆ వైకుంఠవాసుడినే గుండెల్లో దాచుకున్న పరమ పవిత్రమైన క్షేత్రం తిరుమల. ఇక్కడికి చేరుకున్న వారంతా ఆనందనిలయంలో వేంకటేశ్వరస్వామితో పాటు, ఆనంద నిలయంపైన గల విమాన వేంకటేశ్వరస్వామిని సైతం దర్శించుకుంటూ వుంటారు. గర్భాలయం పై కోణం ఆకారంలో గల నిర్మాణాన్ని 'విమానం' అంటారు.

విమానంపై కనిపించే వేంకటేశ్వర స్వామి చిన్న ప్రతిమనే విమాన వేంకటేశ్వరస్వామి అని పిలుస్తుంటారు. తొండమానుడు ఏర్పాటు చేసిన ఇక్కడి ప్రతిమ అచ్చు మూలమూర్తిని పోలి కనిపిస్తూ వుంటుంది. విమానంలో భాగంగా రూపొందించిన చిన్న మందిరంలో భక్తులు గుర్తించడానికి వీలుగా మకరతోరణంతో సహా వేంకటేశ్వరుడు దర్శనమిస్తూ ఉంటాడు.

ఈ విమాన వేంకటేశ్వర స్వామికి రెండు వైపులా బాలకృష్ణుడు ... గరుత్మంతుడు ... హనుమంతుడి ప్రతిమలు దర్శనమిస్తూ వుంటాయి. సాధారణ మానవులకు ఈ విమానం ఒక నిర్మాణంగా మాత్రమే కనిపిస్తుందనీ, తపోబల సంపన్నులకు మాత్రం పుష్పక విమానంలా కనిపిస్తుందని అంటారు.

ఈ విమానంలోనే వేంకటేశ్వరస్వామి వైకుంఠానికి ... భూలోకానికి తిరుగుతూ ఉంటాడని పురాణాలు చెబుతున్నాయి. ఇక గర్భాలయంలోని శ్రీవారితో పాటుగా విమాన వేంకటేశ్వరుడికి కూడా లోపలి నుంచే నైవేద్యాలు సమర్పిస్తూ వుంటారు. విమాన వేంకటేశ్వరస్వామిని మాత్రమే దర్శించగలిగిన భక్తులకి, గర్భాలయంలోని ప్రధానమూర్తిని దర్శించిన ఫలితం దక్కుతుందని అంటారు.

More Bhakti Articles