కొండగుహలో కొలువైన శివుడు

కొండగుహలో కొలువైన శివుడు
శివుడిని కైలాసనాథుడని చెప్పుకుంటున్నప్పటికీ, భక్తులు తన కోసం ఎక్కడైతే ధ్యానం చేస్తుంటారో ఆయన అక్కడే ఎక్కువగా కనిపిస్తుంటాడు. ఈ నేపథ్యంలోనే ఆయన కొండకోనల్లోను ... వాగువంకల్లోను దర్శనమిస్తూ వుంటాడు. ఆయన ఆవిర్భవించిన ప్రదేశాలలో ఆనందింపజేసేవి కొన్నయితే, అన్వేషణకి అందనవి ఎన్నో వున్నాయి. కష్టతరమైన అలాంటి అన్వేషణ ద్వారా వెలుగులోకి వచ్చిన క్షేత్రంగా 'అక్కమహాదేవి' గుహలు కనిపిస్తుంటాయి.

శ్రీశైల పర్వత శ్రేణుల్లో ఒక భాగంగా ... కృష్ణా తీరంలో ఈ క్షేత్రం దర్శనమిస్తుంటుంది. 12 వ శతాబ్దానికి చెందిన అక్కమహాదేవి శివ భక్తురాలు. బాల్యం నుంచి శివారాధన తప్ప ఆమెకి మరేమీ తెలియదు. శ్రీశైల మల్లికార్జునుడిని తన భర్తగా భావించి, నిరంతరం ఆయన నామస్మరణం చేస్తూ ఆయనలోనే ఐక్యమైపోయింది. అక్కమహాదేవి గుహలకు చేరుకోవాలంటే, కృష్ణా నదిలో పడవ ప్రయాణం చేయవలసి వుంటుంది.

ఈ ప్రయాణం మరిచిపోలేని మధురమైన అనుభూతిని కలిగిస్తుంది. తీరా అక్కమహాదేవి గుహల దగ్గరికి వెళ్లిన తరువాత ఎంతటి వారైనా ఆశ్చర్యపోకమానరు. ఆ కొండలు ... ఆ గుహలు చూడగానే, ఇప్పుడే ఈ ప్రాంతం ఇంత అరణ్యంగా వుంటే అప్పట్లో మరెంత భయంకరంగా వుండేదోననిపిస్తుంది. అసలు ఈ ప్రదేశానికి ఆమె ఎలా వచ్చిందో ... చీకటి గుహలో శివారాధన ఎలా చేసిందోనని అంతా ఆలోచనలో పడతారు.

ఆమె ఆరాధన కోసం ఆవిర్భవించిన శివలింగం నేటికీ ఇక్కడ పూజలు అందుకుంటోంది. అక్కమహాదేవి వంటి మహాభక్తురాలు పూజించిన స్వయంభువు శివలింగాన్ని దర్శించడాన్ని అంతా అదృష్టంగా భావిస్తుంటారు. మహాదేవుడు అనుగ్రహాన్ని ... అక్కమహాదేవి ఆశీస్సులను కోరుతూ వెనుదిరుగుతారు.

More Bhakti Articles