రాఘవేంద్రుని రక్ష!

రాఘవేంద్రుని రక్ష!
రాఘవేంద్రస్వామి శిష్యులు ఎంతో నియమనిష్టలను పాటిస్తూ వుండేవారు. అనుక్షణం తమ గురువును కనిపెట్టుకుని ఉంటూ ఆయన సేవలో తరిస్తూ వుండేవాళ్లు. అయితే అందులో ఒక శిష్యుడుకి మాత్రం గృహస్తు జీవితంపట్ల ఆసక్తి కలిగింది. వివాహం చేసుకుని, గురువు చూపిన భక్తి మార్గంలో ప్రయాణించాలని నిర్ణయించుకున్నాడు. అయితే ఆ విషయాన్ని రాఘవేంద్ర స్వామికి ఎలా చెప్పాలో తెలియక సతమతమైపోసాగాడు.

ఎప్పటిలాగానే ఆ శిష్యుడు స్వామి స్నానానికి యేటి నుంచి నీళ్లు ... ఇసుక తీసుకువచ్చాడు. ఇకపై వివాహం చేసుకుని గృహస్తుగా ఆదర్శవంతమైన జీవితాన్ని కొనసాగించమని ఆ శిష్యుడితో చెప్పాడు రాఘవేంద్రుడు. ఆ మాటకి ఆ శిష్యుడు కంగారుపడిపోయాడు. మనసులో అనుకున్నది వెంటనే స్వామికి తెలిసిపోతుందనే విషయాన్ని మరిచిపోయినందుకు తనని తాను నిందించుకున్నాడు.

అతను ఊరికి చేరుకునేలోగానే మంచిసంబంధం దొరుకుతుందని శిష్యుడితో రాఘవేంద్రుడు చెప్పాడు. అతను ప్రయాణించేది అరణ్యప్రాంతం కావడం వలన తన 'రక్ష'గా వుంచమంటూ పిడికెడు ఇసుకను ప్రసాదించాడు. ఆ ఇసుకను చిన్నవస్త్రంలో కట్టుకుని ఆయన శిష్యుడు బయలుదేరాడు. అలా కొన్ని రోజులపాటు ప్రయాణించిన ఆ శిష్యుడు, చీకటిపడే సమయానికి ఒక గ్రామానికి చేరుకున్నాడు.

అక్కడ ఓ ఇంటి యజమాని అనుమతి తీసుకుని అరుగుపై పడుకున్నాడు. అర్ధరాత్రివేళ ఏదో అలికిడి కావడంతో, ఆయన నిద్రలేచాడు. అంతకుముందు రోజున జన్మించిన ఆ ఇంటి శిశువును అంతం చేయడానికి ఒక రాక్షసుడు ప్రయత్నిస్తూ వుండటం ఆయన కంటపడింది. అడ్డుకోబోయిన ఆయనపైకి రాక్షసుడు ఒక్కసారిగా దూసుకువచ్చాడు. వెంటనే ఆయన తనకి రాఘవేంద్ర స్వామి ఇచ్చిన ఇసుకను ఆ రాక్షసుడిపై చల్లాడు. అంతే ఆ రాక్షసుడు అక్కడికక్కడే బూడిద కుప్పగా మారిపోయాడు.

రాక్షసుడి బారినుంచి తమ కుటుంబానికి విముక్తిని కలిగించినందుకు ఆయన్ని ఆ ఇంటి యజమాని అభినందించాడు. ఆయన వివరాలు తెలుసుకుని తన చిన్న కూతురినిచ్చి వివాహం చేశాడు. తన మనసులోని మాటను తెలుసుకుని, తనకి కొత్త జీవితాన్ని ప్రసాదించిన రాఘవేంద్రస్వామికి ఆయన శిష్యుడు మనసులోనే కృతజ్ఞతలు తెలియజేశాడు ... భార్యను వెంటబెట్టుకుని తన ఊరికి బయలుదేరాడు.

More Bhakti Articles