శ్రీ బాలా త్రిపుర సుందరీ క్షేత్రం

శ్రీ బాలా త్రిపుర సుందరీ క్షేత్రం
అమ్మవారు ధరించిన నవవిధ దుర్గారూపాల్లో బాలాత్రిపురసుందరి అవతారానికి ఎంతో విశిష్టత వుంది. ముద్దులొలుకుతూ భక్తుల ముచ్చట తీర్చడం కోసమే అమ్మవారు ఈ రూపాన్ని ధరించిందా అనిపిస్తూవుంటుంది. బాలా త్రిపురసుందరి ఆమ్మవారు కొలువైన క్షేత్రాలు చాలా అరుదుగా కనిపిస్తూ వుంటాయి. అలాంటి అరుదైన క్షేత్రాల్లో ఒకటి 'కాకినాడ'లో అలరారుతోంది.

బాలగా అమ్మవారు కొలువైన క్షేత్రం ఎంత ప్రశాంతంగా ఉంటుందని అనుకుంటామో, ఎంత కుదురుగా తీర్చిదిద్దినట్టు ఉంటుందని భావిస్తామో అలాగే ఈ ఆలయం దర్శనమిస్తూ వుంటుంది. విశాలమైన ప్రదేశంలో నిర్మించబడిన ఈ ఆలయం, అడుగడుగునా భక్తిభావ పరిమళాలను వెదజల్లుతూ వుంటుంది. గర్భాలయంలో అమ్మవారి మూర్తి కళకళలాడుతూ కనిపిస్తూ వుంటుంది. అమ్మవారిని చూడగానే మనసుని ఆమె పాదాల చెంత సమర్పిచాలనిపిస్తుంది.

ప్రతి శుక్రవారం అమ్మవారికి విశేషంగా కుంకుమ పూజలు జరుగుతూ వుంటాయి. మండలంపాటు అమ్మవారికి ప్రదక్షిణలు చేస్తే, అమ్మవారు అనుగ్రహిస్తుందని భక్తులు అనుభవపూర్వకంగా చెబుతుంటారు. ఇదే ప్రాంగణంలో శ్రీ రామలింగేశ్వర స్వామి కూడా నిత్యపూజాభిషేకాలు అందుకుంటున్నాడు. ఇక వినాయకుడు .. శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి .. దత్తాత్రేయ .. అయ్యప్పస్వామి మందిరాలను భక్తులు దర్శించుకుంటూ వుంటారు.

సకల దైవస్వరూపాలు నెలకొని వున్న కారణంగా, ఆయా పుణ్య తిథుల్లో ఆయా దైవాలకు ప్రత్యేక పూజలు .. ఉత్సవాలు జరుగుతుంటాయి. ఈ సందర్భంగా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తుంటారు ... అమ్మవారి అనుగ్రహాన్ని కోరుకుని ఆనందంతో వెనుదిరుగుతుంటారు.

More Bhakti Articles