అధికమాసంలో దీపారాధన

అధికమాసంలో దీపారాధన
ఏ మాసంలోనైతే సూర్య సంక్రమణం జరగదో, ఆ మాసాన్ని 'అధికమాసం' అంటారని శాస్త్రం చెబుతోంది. సాధారణంగా అధికమాసంలో శుభకార్యాలు ... దైవకార్యాలు చేపట్టరు. అయితే అధికమాసంలో 'దీపారాధన' అత్యంత విశిష్టమైనదని శాస్త్రం చెబుతోంది. ఈ మాసమంతా నియమనిష్టలతో కూడిన దీపారాధన చేయడం వలన అనేక దోషాలు తొలగిపోతాయి.

ఈ మాసమంతా కూడా ఒక వ్రతంగా భావించి దీపారాధన చేయాలి. పూజామందిరంలో రాధాకృష్ణుల ప్రతిమను పెట్టుకుని వారిని ఆరాధించవలసి వుంటుంది. ఈ మాసం ఆరంభంలో అఖండ దీపారాధన చేసి, మాసం పూర్తి అయ్యేంత వరకూ అది కొండెక్కకుండా చూసుకోవాలి. ఇక దీపారాధనలో రెండు .. అయిదు .. తొమ్మిది .. పదకొండు .. ఇరవై ఒకటి .. ముప్పైమూడు వత్తులను వెలిగించవచ్చు.

మొదటి రోజున ఎన్ని వత్తులతో దీపారాధన చేశారో, చివరిరోజు వరకూ అదే సంఖ్యలో వత్తులను వెలిగిస్తూ వుండాలి. అఖండ దీపారాధన చేయడానికి ఆటంకాలు వున్న వాళ్లు, ఈ మాసమంతా దేవాలయంలో దీపం వెలిగించవచ్చు. ఈ విధంగా చేయడం వలన కూడా ఒకే విధమైన ఫలితం వుంటుంది.

అధిక మాసం పూర్తి అయిన తరువాత దీపంలో బంగారు వత్తి వేసి బ్రాహ్మణులకు దానం చేయాలి. అంతటి స్తోమత లేనివారు వెండిదీపాన్ని దక్షిణతోపాటుగా సమర్పించాలి. అధికమాసంలో ఈ విధమైన దీపారాధన వలన ... దీపదానం వలన సమస్తపాపాలు నశించి, సకల శుభాలు కలుగుతాయని శాస్త్రం చెబుతోంది.

More Bhakti Articles