శివాజీని కాపాడిన తుకారామ్

శివాజీని కాపాడిన తుకారామ్
తుకారాం రచించిన అభంగాలను శివాజీ మహారాజు విని వున్నాడు. ఆయన భక్తి శ్రద్ధలను గురించీ, నీతీ నిజాయితీలను గురించి తెలుసుకున్నాడు. అయితే ఆ గ్రామానికి చెందిన కొందరు స్వార్ధపరులు తుకారామ్ పై కక్షగట్టి ఆయనని నిందలపాలు చేయడానికి చూస్తున్నారని ఆయన గ్రహించాడు. తుకారాం ఎంతటి భక్తుడనే విషయం తాను ప్రత్యక్షంగా చూడటమే కాకుండా, అంతా తెలుసుకునేలా చేయాలని నిర్ణయించుకున్నాడు.

అనుకున్నదే తడవుగా ఆ గ్రామానికి చేరుకొని, తుకారాం భక్తిని పరీక్షించే ఉద్దేశంతో ఆయన గొప్పతనం నలుగురికీ తెలిసేలా చేశాడు. అయితే తుకారాం కోసం శివాజీ ఒంటరిగా ఆ గ్రామానికి వచ్చిన విషయం ఆయన శత్రువులకి తెలిసిపోయింది. శివాజీని బంధించడానికి అంతకన్నా మంచి అవకాశం దొరకదని భావించి, వెంటనే తమ సైన్యంతో దెహూ గ్రామానికి బయలుదేరారు.

వేగుల ద్వారా ఈ విషయం తెలుసుకున్న శివాజీ, ఒంటరిగానే ఆ సైన్యాన్ని ఎదుర్కోవడానికి సిద్ధపడ్డాడు. ఆయనని వారించి ఆ పాండురంగ స్వామిని ప్రార్ధించాడు తుకారాం. అంతే ... ఆ గ్రామ పొలిమేరల్లోనే శత్రు సైన్యం ఆశ్చర్యానికి గురైంది. తమని ఎదుర్కోవడానికి వేలమంది శివాజీలు సిద్ధంగా వుండటం చూసి బిత్తరపోయారు. ఒక్కో సిపాయిని ఒక్కో శివాజీ ఎదుర్కోవడంతో శత్రుసైన్యం తోకముడిచింది.

ఈ దృశ్యం కళ్లారా చూసిన వాళ్లు, జరిగినదంతా శివాజీతో చెప్పారు. అదంతా పాండురంగ స్వామి మహిమయనీ, తుకారాం అసమానమైన భక్తియని శివాజీకి అర్థమైపోయింది. నాటి నుంచి ఆయన కూడా పాండురంగ స్వామి పట్ల అచెంచలమైన విశ్వాసాన్ని ... తుకారాం పట్ల విధేయతను కనబరుస్తూ వచ్చాడు.

More Bhakti Articles