శ్రీ వేణుగోపాలస్వామి

శ్రీ వేణుగోపాలస్వామి
బాల కృష్ణుడు అల్లరివాడు ... అందరివాడు అనే విషయం తెలిసిందే. వెన్నలను దొంగిలించడం కృష్ణుడికి అలవాటు ... అయితే ఆయన భక్తులు కూడా ఆయన విగ్రహాన్ని దొంగిలించి తీసుకు వచ్చి ప్రతిష్ఠ చేయడం మరింత ఆశ్చర్యకరంగా అనిపించకమానదు. ఈ సంఘటన జరిగిన ప్రదేశమే మెదక్ జిల్లా దుబ్బాక మండలంలోని 'చెల్లాపూర్'.

ఇక శ్రీ కృష్ణుడి అల్లరి చేష్టలు లోక కల్యాణం కోసమైతే, ఆయన భక్తులు ఈ దొంగతనం చేసింది మాత్రం దొరల పెత్తందారితనం నుంచి తమని తాము కాపాడటం కోసమే. ఒకప్పుడు ఈ ప్రాంతమంతా దొరల ఏలుబడిలో వుండేది. పన్నుల పేరుతో దొరలు గ్రామస్తులను అనేక విధాలుగా హింసించేవారు. గ్రామస్తులంతా దొరపై తిరగబడటంతో, వారి దగ్గరనుంచి డబ్బు వసూలు చేసేది వారి ఊళ్లో ఓ గుడి కట్టించడానికి అని చెప్పాడట. దాంతో గ్రామస్తులంతా కలిసి తామే ఓ గుడి కట్టి దొర పెత్తనానికి తగిన సమాధానం చెప్పాలని నిర్ణయించుకున్నారు.

విగ్రహం చెక్కడానికి చాలాకాలం పడుతుందని భావించి, అదే జిల్లాలోని ఓ పురాతనమైన ఆలయంలో పూజకు నోచుకోకుండా పడి వున్న 'వేణు గోపాలస్వామి' విగ్రహాన్ని దొంగిలించి తీసుకు వచ్చారు. ఈ విషయం తెలిసి ఆ ఊరు ప్రజలు గొడవకి వస్తున్నారని తెలిసి ఆ స్వామికి మీసాలు ... కిరీటం పెట్టారు. దాంతో ఆ వూరు పెద్దలు ఆ విగ్రహాన్ని పోల్చుకోలేక, అది తమ ఊరుకి చెందినది కాదని చెప్పేసి వెళ్లిపోయారట. అలా ఇక్కడి శ్రీకృష్ణుడు మీసాలు ... కిరీటం కలిగివుండి ఓ ప్రత్యేకతను సంతరించుకుని కనిపిస్తున్నాడు.

ఈ గ్రామ ప్రజలను ఇబ్బంది పెడదామనుకున్న దొర కూడా కృష్ణుడి రాకతో మనసు మార్చుకుని, తన వంతుగా విరాళాన్ని కూడా అందజేసి వెళ్లిపోయాడట. ఇక ఆ నాటి నుంచి నేటి వరకూ ఈ దేవాలయంలోని అఖండ దీపం వెలుగుతూనే వుండటం విశేషం. ఆలయ ప్రాంగణంలో హనుమంతుడి మందిరం ... కోనేరు కనిపిస్తాయి. దాదాపు రెండువంద యేళ్ళ చరిత్ర గల ఈ ఆలయం ప్రశాంతతకు ... పవిత్రతకు మారుపేరుగా వెలుగొందుతూనే వుంది.
Get the ap7am app Free · Opens in one tap Install

More Bhakti Articles