గోకుల తిరుమల

గోకుల తిరుమల
'గోకుల తిరుమల పారిజాత గిరి' అనేది ఇక్కడి క్షేత్రం పేరు. అంతా గోకుల తిరుమల అని పిలుస్తూ వుంటారు. నిజానికి ఈ పేరు వినగానే ఒక పవిత్రమైన భావం కలుగుతుంది ... ఆధ్యాత్మిక అనుభూతి అందంగా వికసిస్తుంది. శ్రీ కృష్ణుడే ... శ్రీనివాసుడుగా ఆవిర్భవించాడని పురాణాలు చెబుతున్నాయి. అలాంటి కృష్ణుడి లీలా విన్యాసాలను గుర్తుకుతెస్తూ శ్రీ వేంకటేశ్వరుడు కొలువైన ఈ క్షేత్రం మరో తిరుమలగా ప్రసిద్ధి చెందింది.

ఇక్కడి స్వామిని మొదటగా పశువుల కాపరులు కనుక్కున్న కారణంగా 'గోకులం' గా ... శ్రీనివాసుడు కొలువైన కారణంగా 'తిరుమల' గా ... ఈ కొండపై పారిజాత వృక్షాలు విస్తారంగా వుండటం వలన 'పారిజాత గిరి' గా పిలుస్తుంటారు. ఇలా ఇన్ని కారణాల వలన ఈ క్షేత్రానికి 'గోకుల తిరుమల పారిజాత గిరి' అనే అందమైన పేరు ఏర్పడింది. ఇంతటి సుందరమైన పేరు ... పవిత్రమైన ఆలయం కలిగిన క్షేత్రం పశ్చిమ గోదావరి జిల్లాలోని జంగారెడ్డి గూడెం సమీపంలో అలరారుతోంది.

పూర్వం కొందరు పశువుల కాపరులు ఈ కొండపైకి మేత కోసం పశువులను తీసుకువచ్చారు. ఆ సమయంలోనే వారు ఇక్కడ స్వామివారి పాద ముద్రలను చూశారు. ఈ విషయం గ్రామస్తులకు చెప్పగా, ఆ రోజు నుంచే అంతా ఆ పాదాలను పూజించడం ప్రారంభించారు. అలా కొంతకాలం తరువాత గ్రామస్తులంతా కలిసి స్వామివారికి ఆలయం నిర్మించారు. కొండపై నిర్మించబడిన ఈ ఆలయం ఆధ్యాత్మిక వైభవాన్ని చాటుతూ వుంటుంది.

గర్భాలయంలో వేంకటేశ్వర స్వామి నిలువెత్తు విగ్రహం సుమనోహరంగా దర్శనమిస్తూ వుంటుంది. ఆయన సౌందర్యం చూడటానికి రెండు కళ్ళూ సరిపోవు. ఇక ప్రత్యేక మందిరాలలో కొలువైన శ్రీ దేవి - భూదేవి భక్తులచే పూజలు అందుకుంటూ వుంటారు.తిరుమల శ్రీవారి తేజస్సు ... ఆయన మహాత్మ్యం ఇక్కడి స్వామి కలిగివున్నాడని స్థానికులు చెబుతుంటారు. స్వామిని దర్శించిన భక్తులు కూడా ఇదే విషయాన్ని విశ్వసిస్తూ వుంటారు. పర్వదినాల సమయంలో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు ఇక్కడికి వస్తుంటారు. ప్రశాంతమైన వాతావరణంలో ... కొండపై కొలువుదీరిన స్వామివారిని దర్శించి ధన్యులవుతుంటారు.

More Bhakti Articles