శ్రీ గంగమ్మతల్లి క్షేత్రం

శ్రీ గంగమ్మతల్లి క్షేత్రం
భగీరథ మహర్షి అభ్యర్థన మేరకు భువికి దిగి వచ్చిన గంగ, అనేక క్షేత్రాలను అభిషేకిస్తూ ముందుకు సాగుతోంది. ఎందరో మహర్షుల ... మరెందరో భక్తుల జీవితాలను చరితార్థం చేసిన గంగ, జీవకోటికి ప్రాణాధారమై పూజలు అందుకుంటోంది. అమ్మగా భక్తులను చేరదీస్తూ, గంగమ్మగా తన బిడ్డలచే పిలిపించుకుంటోంది. అలా గంగమ్మ తల్లి ఆవిర్భవించిన క్షేత్రమే 'చింతకొమ్మల దిన్నె'.

ప్రాచీన కాలంనాటి ఈ క్షేత్రం కడప జిల్లాలో దర్శనమిస్తుంది. గర్భాలయంలో అమ్మవారు ప్రశాంత వదనంతో కరుణామూర్తిగా దర్శనమిస్తూ వుంటుంది. గంగమ్మతల్లిని ఇక్కడి భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తుంటారు. ఈ తల్లి దయ వల్లనే తమ గ్రామాలకు నీటి కొరత లేకుండా పోయిందని విశ్వసిస్తుంటారు. ఆమె అనుగ్రహం కారణంగానే పాడిపంటలు వృద్ధి చెందుతున్నాయని చెబుతుంటారు. అంతే కాకుండా వివిధ రకాల వ్యాధుల బారి నుంచి ఈ అమ్మవారు తమని కాపాడుతుందని నమ్ముతుంటారు. అందుకు నిదర్శనంగా నిలిచిన కొన్ని సంఘటనల గురించి కూడా చెబుతుంటారు.

అమ్మవారితో పాటు ఆమె సోదరుడైన పోతురాజుని కూడా భక్తులు పూజిస్తూ వుంటారు. పోతురాజుని గ్రామ రక్షకుడిగా భావించి ఆయనకు విశేష పూజలు నిర్వహిస్తూ వుంటారు. అమ్మవారిని దర్శించుకున్న భక్తులు ఆమెకి నూతన వస్త్రాలు .. పూలు ... గాజులు ... పసుపు కుంకుమలు సమర్పిస్తుంటారు. అమ్మవారికి ఇష్టమైన పాయసాన్ని నైవేద్యంగా సమర్పించి, దానిని ప్రసాదంగా స్వీకరిస్తూ వుంటారు.

ప్రతి శుక్రవారమే కాకుండా, విశేషమైన పుణ్య తిథుల్లో అమ్మవారిని దర్శించుకునేవారి సంఖ్య ఎక్కువగా వుంటుంది. ఇక్కడ ఎవరి కుటుంబంలో ఎలాంటి వేడుక జరిగినా, వారంతా అమ్మవారి ఆలయానికి వచ్చి ఆమెను పూజించి ఆశీస్సులు అందుకుంటూ వుంటారు. ఆమె అనుగ్రహంతో సంతృప్తికరమైన జీవితాన్ని కొనసాగిస్తూ వుంటారు.

More Bhakti Articles