కృష్ణ వర్ణంలో సాయినాథుడు

కృష్ణ వర్ణంలో సాయినాథుడు
సాధారణంగా శిరిడీసాయి మందిరం అనగానే విశాలమైన మంటపం ... వేదికపై పాల నురుగులా తెల్లని వర్ణంలో సాయి విగ్రహం కొలువై వుండటం కనిపిస్తూ వుంటుంది. సాయిబాబా ప్రతిమ తెల్లగా కాకుండా నల్లగా కనిపిస్తే భక్తులు తప్పకుండా ఆశ్చర్యపోతుంటారు. అలా మిగతా ఆలయాలకు భిన్నంగా కృష్ణ శిలతో బాబాను రూపొందించుకుని నిర్మించబడిన మందిరం మనకి ఖమ్మంలో కనిపిస్తుంది.

ఉత్తరభారత దేశంలో ఆలయాలను దర్శించినప్పుడు, అక్కడి మూలమూర్తులు పాలరాతితో మలచబడి దర్శనమిస్తుంటారు. అదే దక్షిణ భారతానికి వచ్చేసరికి విగ్రహం నల్లగా ఉంటేనే విశిష్టమైనదిగా భావిస్తుంటారు ... పవిత్రమైనదిగా పూజిస్తుంటారు. శ్రీ రాముడు ... శ్రీ కృష్ణుడు ... శ్రీనివాసుడు ... ఇలా నల్లరాతితో మలచబడిన దేవతా మూర్తుల పట్లనే ఎక్కువ భక్తి విశ్వాసాలు కలుగుతుంటాయి. ఈ కారణంగానే ఈ క్షేత్రంలో సాయిబాబా మనకి పాలరాతి మూర్తిగా కాకుండా కృష్ణ శిలతో మలచబడి కనిపిస్తుంటాడు.

ఈ విషయమే ఈ క్షేత్రానికి విశేషంగా చెప్పుకుంటూ వుంటారు. ఇక నల్లని వర్ణంలో కనిపించే ఇక్కడి సాయిని చూస్తే పురాణకాలంనాటి అవతార పురుషుడిని దర్శించినట్టుగా, ఒక విచిత్రమైన అనుభూతి కలుగుతుంది. ఈ ప్రాంతానికి చెందిన ఒక అర్చకుడికి స్వప్నంలో స్వామి కనిపించి తనని ప్రతిష్ఠించి పూజించమని చెప్పాడట. అయితే కలలో స్వామి నలుపు వర్ణంలో దర్శనమిచ్చి ఆదేశించడం ఆయనను ఆశ్చర్యానికి గురిచేసింది.

పెద్దల సూచన మేరకు ఆయన తనకి కలలో స్వామి దర్శనమిచ్చిన వర్ణంలోనే విగ్రహాన్ని తయారు చేయించాలని నిర్ణయించుకున్నాడు. అలా ఆయన కృషి మేరకు ఇక్కడ బాబా మందిరం నిర్మించబడింది. ఆ రోజు నుంచి ఆలయం అభివృద్ధి చెందుతూ వస్తోంది. ప్రతి గురువారంతో పాటు, పర్వదినాల సమయంలో ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య ఎక్కువగా వుంటుంది.

ఇదే ఆలయ ప్రాంగణంలో దత్తాత్రేయుడు ... గణపతి ... పంచముఖ ఆంజనేయుడు ... శనిదేవుడు కొలువై పూజలు అందుకుంటూ వుంటారు. ఇక్కడి బాబాను దర్శించడం వలన సమస్త దోషాలు తొలగిపోయి సకల శుభాలు కలుగుతాయని భక్తులు ప్రగాఢ విశ్వాసాన్ని ప్రకటిస్తుంటారు.

More Bhakti Articles