లక్ష్మీనారసింహ క్షేత్రం

లక్ష్మీనారసింహ క్షేత్రం
హిరణ్యకశిపుడిని వధించి బాలప్రహ్లాదుడిని అనుగ్రహించిన నరసింహస్వామి, అనేక ప్రదేశాల్లో లక్ష్మీసమేతుడై ఆవిర్భవించాడు. అలా స్వామివారు కొలువుదీరిన పరమపవిత్రమైన పుణ్యక్షేత్రాలలో ఒకటిగా అనంతపురం జిల్లాకి చెందిన 'భక్తరహళ్లి' దర్శమిస్తుంది. ఇక్కడి లక్ష్మీ నరసింహస్వామి శ్రీకృష్ణదేవరాయల కాలంలో ప్రతిష్ఠించబడినట్టుగా స్థలపురాణం చెబుతోంది.

శ్రీ కృష్ణదేవరాయల వారి గుర్తువైన వ్యాసరాయల వారు, గ్రహకూటమిలో సంభవించిన మార్పులు గమనించి, దేశానికి కలగనున్న అరిష్టాన్ని నివారించడానికి వీలైనన్ని ఆలయాలు నిర్మించాలని సూచించాడు. ఆ ప్రకారం రాయల వారు నిర్మిస్తూ వచ్చిన ఆలయాల్లో ఈ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఒకటి. అయితే ప్రతిష్ఠ సమయంలో మూలమూర్తిగా మలచబడిన రాయిలో లోపం వుండటం గమనించిన వ్యాసరాయల వారు, తాను నిత్యం ఆరాధించే సాలగ్రామ ప్రతిమని అదే ముహూర్తానికి ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. ఈ కారణంగా ఇది మరింత మహిమాన్వితమైన క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది.

పర్వత పాదాల చెంత ఆహ్లాదకరమైన వాతావరణంలో కొలువైన ఇక్కడి స్వామిని దర్శించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తుంటారు. గర్భాలయంలో స్వామివారు మహా తేజస్సుతో వెలిగిపోతూ భక్తులను అనుగ్రహిస్తూ ఉంటాడు. ఈ గర్భాలయాన్ని 'నరసింహ బృందావనం'గా పిలుస్తుంటారు. ఇక ఆలయ ప్రాంగణంలో శ్రీ రాముడు ... హనుమంతుడు ... అంజనాదేవి ... నాగదేవత ... నవగ్రహాలు ప్రత్యేక మందిరాల్లో కొలువై పూజలు అందుకుంటూ వుంటారు.

ప్రతియేటా నృసింహ జయంతి పర్వదినాన స్వామివారికి ప్రత్యేక పూజలు ... ఉత్సవాలు నిర్వహించబడుతుంటాయి. ఇక తొలి ఏకాదశిని పురస్కరించుకుని అయిదు రోజులపాటు జాతర జరుగుతుంటుంది. 'జ్యోతుల జాతర' పేరుతో జరిగే ఈ ఉత్సవానికి వివిధ ప్రాంతాల నుంచి వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. లక్ష్మీనారసింహుడిని కనులారా వీక్షించి పునీతులవుతుంటారు.

More Bhakti Articles