పాండురంగడి లీల !

పాండురంగడి లీల !
పాండురంగస్వామి భక్తుడిగా తుకారాం గౌరవ మర్యాదలను పొందుతూ వుండటం కొంతమందికి అసూయ కలిగించింది. తుకారాం ఆ గ్రామాన్ని విడిచి వెళితేనే తప్ప, తమకి గుర్తింపు లభించదని వాళ్లు అనుకున్నారు. తుకారాం ఆ ఊరు విడిచి వెళ్లాలంటే, ముందుగా ఆయన నివాసముంటున్న ఇంటిని స్వాధీనం చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చారు. అందుకు తగిన సమయం కోసం ఎదురుచూడసాగారు.

ఈ నేపథ్యంలోనే తుకారాం కుటుంబం గడవాలనే ఉద్దేశంతో ఆ గ్రామానికి చెందిన ఓ రైతు, తన జొన్న పంటకు కాపలాగా ఉండవలసినదిగా తుకారాంని కోరాడు. అందుకు అంగీకరించిన తుకారాం, జొన్న చేను దగ్గర కూర్చుని పాండురంగడి ధ్యానంలో లీనమైపోయాడు. అది గమనించిన దుర్మార్గులు ఆ పంటను తగులబెట్టారు. రంగడి ధ్యానంలో నుంచి తుకారాం బయటికి వచ్చేసరికి పంటంతా బూడిదైపోయింది. దాంతో ఆ రైతు పెద్దమనుషుల పంచాయతి పెట్టించాడు.

అదే సరైన అవకాశంగా భావించిన తుకారాం వ్యతిరేకులు, అతని ఇంటిని ఆ రైతుకి నష్టపరిహారంగా ఇప్పించారు. దాంతో తుకారాం కుటుంబం వీధిన పడింది. అయితే తెలిసినవారు ఆయన కుటుంబానికి ఆశ్రయం కల్పించారు. తుకారాం ఇంటిని స్వాధీనం చేసుకున్న రైతు, తన చేను దగ్గరికి వెళ్లాడు. అది ఎప్పటిలానే ఏపుగా ఎదిగి పచ్చగా నిగనిగలాడుతూ వుండటం చూసి ఆశ్చర్యపోయాడు.

ఇదంతా తుకారాం మహిమగా భావించి నేరుగా ఆయన చెంతకి వెళ్లి పాదాలకు నమస్కరించి తనని మన్నించమని కోరాడు. జరిగినదాంట్లో తన ప్రమేయమేమీ లేదనీ అంతా పాండురంగడి లీల అని చెప్పాడు తుకారాం. ఆ రైతు ఎంతగా అభ్యర్ధించినా తిరిగి సొంత ఇంటికి వెళ్లడం గానీ, ఆ పంటలో భాగాన్ని స్వీకరించడం గాని తుకారాం చేయలేదు. అందుకే పాండురంగడు ఉన్నంత వరకూ తుకారాం జేజేలు అందుకుంటూనే ఉంటాడు.

More Bhakti Articles