సంతాన గణపతి క్షేత్రం

సంతాన గణపతి క్షేత్రం
వినాయక చవితి పండుగను అత్యంత వైభవంగా ... సంబరంగా జరుపుకునే ప్రాంతాలలో ముంబై ముందువరుసలో కనిపిస్తుంది. మొదటి నుంచి కూడా ఇక్కడ గణపతిని ఎక్కువగా ఆరాధిస్తుంటారు. ఈ కారణంగా ఈ ప్రాంతంలో గణపతి ఆలయాలు ఎక్కువగా కనిపిస్తుంటాయి ... ఎప్పుడు చూసినా భక్త జనులతో రద్దీగా వుంటాయి.

అలాగే వినాయక చవితి పండుగ ఆరంభమైన దగ్గర నుంచి నిమజ్జన కార్యక్రమం పూర్తయ్యేంత వరకూ ఇక్కడి గణపతి మందిరాలు కూడా భక్తుల దర్శనంతో సందడిగా కనిపిస్తుంటాయి. అలాంటి ఈ ప్రాంతంలోనే మనకి ప్రసిద్ధి చెందిన 'సిద్ధివినాయక క్షేత్రం' దర్శనమిస్తుంది. 18 వ శతాబ్దం తొలినాళ్లలో నిర్మించబడిన ఈ ఆలయం అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతూ, భక్తుల పాలిట కామధేనువులా అలరారుతోంది.

ఇక్కడి స్వామిని అంతా 'సంతాన గణపతి'గా కొలుస్తుంటారు. 'సంతాన గణపతి'గా స్వామి పూజలు అందుకోవడానికి వెనుక కారణం లేకపోలేదు. శ్రీమంతురాలైన ఓ స్త్రీకి వివాహమై ఎంతకాలమైనా సంతానం కలగక పోవడంతో ఆమె ఆవేదన చెందింది. తన ఆస్తి పాస్తులను స్వామి ఆలయ నిర్మాణానికి ఉపయోగించింది. ఫలితంగా ఇక్కడ గణపతి ఆలయం ఆవిర్భవించింది. గర్భాలయంలో స్వామి సిద్ధి - బుద్ధి సమేతుడై దర్శనమిస్తాడు. స్వామి కొలువైన మందిరం కూడా స్వామి ఆకారంలోనే వుండటం ఇక్కడి విశేషం. ఎటు చూసినా అద్భుతమైన నగిషీలు ... బంగారు పూతలు ఆలయ వైభవానికి అద్దం పడుతూ వుంటాయి.

తొలిసారిగా ఈ స్వామిని దర్శించిన ఆ శ్రీమంతురాలు ... తనకి సంతానం లేకపోవడం గురించి ప్రస్తావిస్తూ స్వామి సన్నిధిలో కన్నీళ్లు పెట్టుకుంది. ఇక నుంచి ఈ ఆలయాన్ని దర్శించి ఎవరు సంతానాన్ని కోరినా వారి కోరిక నెరవేర్చమని ప్రాధేయపడిందట. అప్పటి నుంచి సంతానం కోరిన వారిని స్వామి వెంటనే అనుగ్రహించసాగాడు. స్వామి అనుగ్రహంతో సంతానాన్ని పొందిన భక్తులు, ఆయనకి కృతజ్ఞతలు తెలియజేసి మొక్కుబడులు చెల్లిస్తుంటారు. ఇక వినాయక చవితి పండుగ రోజుల్లో ఈ ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య మరింత ఎక్కువగా వుంటుంది.

More Bhakti Articles