ఆలుమగలను కలిపే గణపతి

ఆలుమగలను కలిపే గణపతి

ఆలుమగలను కలిపే గణపతి
వినాయకుడు నిండైన వ్యక్తిత్వంతో ప్రశాంతతకు ప్రతీకగా కనిపిస్తూ ఉంటాడు. ఆవేశం ... తొందరపాటు ఆయనకి సంబంధించిన చరిత్రలో ఎక్కడా కనిపించవు. కొన్ని సందర్భాల్లో దేవతలంతా ఆందోళనతో గగ్గోలుపెట్టినా, ఆయన మాత్రం నిదానంగా వారికి కావలసిన కార్యాన్ని సాధించి పెట్టాడు. అలాంటి వినాయకుడు అవలీలగానే తన భక్తులను అనుగ్రహిస్తుంటాడు.

ఈ నేపథ్యంలో ఆయన ఆవిర్భవించిన క్షేత్రాలు అనేక ప్రాంతాల్లో అలరారుతున్నాయి. అలా ఆయన ఆవిర్భవించిన పుణ్యక్షేత్రం మనకి మహారాష్ట్రలోని 'టిట్వాలా' లో దర్శనమిస్తుంది. వేల సంవత్సరాల క్రితమే ఆవిర్భవించిన వినాయకుడు, పేష్వాల కాలంలో తవ్వకాల్లో బయటపడటం జరిగింది. దాంతో వారు స్వామికి ఆలయాన్ని నిర్మించి పునఃప్రతిష్ఠ చేసినట్టు చరిత్ర చెబుతోంది.

గణపతి ఆవిర్భవించిన ప్రతి క్షేత్రం కూడా ఏదో ఒక ప్రత్యేకతను సంతరించుకుని కనిపిస్తుంది. ఇక ఈ క్షేత్రం విషయానికే వస్తే ... విడిపోయిన భార్యాభర్తలను కలపడంలో ఇక్కడి వినాయకుడు ప్రసిద్ధిచెందాడు. పూర్వం గాంధర్వ వివాహం చేసుకున్న శకుంతల - దుష్యంతుడు కొన్ని కారణాల వలన విడిపోయారు. తిరిగి కలుసుకోవాలని ఇద్దరూ అనుకున్నప్పటికీ పరిస్థితులు అనుకూలించక ఆవేదన చెందారు. ఇక్కడి వినాయకుడిని దర్శించుకున్న తరువాతనే వారిద్దరూ తిరిగి ఒకటి అయ్యారని స్థలపురాణం చెబుతోంది.

ఈ కారణంగానే వైవాహిక జీవితంలో ఇబ్బందులుగల వాళ్లు ... విడిపోయిన భార్యాభర్తలు ఇక్కడికి ఎక్కువగా వస్తుంటారు. అలా వచ్చిన వాళ్లు ఆ తరువాత కలిసిపోయి అన్యోన్య దంపతులుగా తిరిగి వచ్చి స్వామి దర్శనం చేసుకుంటూ ఉంటారని స్థానికులు చెబుతుంటారు. సాధారణ రోజుల్లోనే రద్దీగా కనిపించే ఈ ఆలయానికి, పర్వదినాల సమయంలో భక్తుల తాకిడి మరింత ఎక్కువగా వుంటుంది.

More Bhakti Articles