వరాల వినాయకుడు

వరాల వినాయకుడు
కాణిపాకంలో స్వయంభువుగా ఆవిర్భవించిన గణపతి వరాలను ప్రసాదించే వినాయకుడిగా ప్రసిద్ధిచెందాడు. తన ఆవిర్భావంతోనే ... తన తొలిదర్శనంతోనే మానవుల పాపాలను ... లోపాలను తొలగించిన ఇక్కడి స్వామి అంటే ఎంతోమంది అపారమైన విశ్వాసాన్ని ప్రకటిస్తుంటారు.

మహిమాన్వితమైన ఇక్కడి స్వామి సత్యప్రమాణాలకు పెట్టింది పేరు. పూర్వం నుంచి ఈనాటి వరకూ కూడా ఏదైనా నిందపడిన వారు 'కాణిపాకం వినాయకుడి పై ఒట్టు' పెడుతూ తాము తప్పుచేయలేదని చెబితే ఇక ఆ మాటకు తిరుగు వుండదు. వాళ్లు ఆ తప్పుచేయలేదనే పెద్దలంతా భావిస్తారు. ఇక తప్పుచేసిన వారు ఆయన సన్నిధిలో అబద్ధం చెప్పడానికి ఎంత మాత్రం సాహసించరు.

స్వామివారిని అంకిత భావంతో ప్రార్ధించాలే కాని ఆయన వెంటనే అనుగ్రహిస్తారనడానికి ఎన్నో నిదర్శనాలు కనిపిస్తూ వుంటాయి. పూర్వం ఈ ప్రాంతంలో రామలక్ష్మణుల వంటి ఇద్దరు అన్నదమ్ములు వుండేవారట. వారిలో చిన్న పొరపాటు చేసిన తమ్ముడు, రాజుగారు అమలుపరిచిన శిక్ష కారణంగా రెండు చేతులూ పోగొట్టుకున్నాడు. తమ్ముడిని వెంటబెట్టుకుని అన్నయ్య దారి పొడవునా ఏడుస్తూ ఇక్కడి స్వామివారి చెంతకు చేరుకున్నాడు.

చేతులు లేని తన తమ్ముడిని అనుగ్రహించమంటూ స్వామిని పరి పరి విధాలా ప్రార్ధించాడు. దాంతో ఆ క్షణమే తమ్ముడి చేతులు తిరిగి వచ్చాయట. ఆనందాశ్చర్యాలకి లోనైనా అన్నదమ్ములు, ఇక్కడి వినాయకుడు మహిమాన్వితుడని గ్రహించి, కడవరకూ స్వామి సేవకే తమ జీవితాన్ని అంకితం చేశారనే విషయం స్థలపురాణం వలన తెలుస్తోంది.

More Bhakti Articles