శ్రీవారి లెక్క శ్రీవారిదే

శ్రీవారి లెక్క  శ్రీవారిదే
తిరుమల క్షేత్రాన్ని భక్తులు భూలోక వైకుంఠంగా విశ్వసిస్తుంటారు ... భక్తి శ్రద్ధలతో ఆ స్వామిని సేవించి తరిస్తుంటారు. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే తిరుమలలో శ్రీనివాసుడిగా ఆవిర్భవించిన కారణంగా ప్రతి రోజు కొన్ని లక్షల మంది ఆయన దర్శనానికి ఈ క్షేత్రానికి వస్తుంటారు.

స్వామివారు ఆపదమొక్కులవాడిగా ప్రసిద్ధి చెందడం వలన, కానుకల రూపంలోనూ ... మొక్కుబడుల రూపంలోనే కాకుండా, విరాళాల రూపంలోనూ ఆలయానికి భారీగా ఆదాయం వస్తుంటుంది. స్వామివారికి సంబంధించిన వివిధ సేవలకుగాను ఈ ఆదాయాన్ని వినియోగిస్తుంటారు. అయితే ఏ రోజున ఎంత ఆదాయం వచ్చిందో ... ఏ రోజున ఏ కారణంగా ఎంత వ్యయం అయిందనేది స్వామివారికి లెక్క చెబుతారనే విషయం చాలా తక్కువ మందికి తెలిసి వుంటుంది.

మూలమూర్తి అంశగా భావిస్తోన్న భోగ శ్రీనివాస మూర్తికి ప్రతి రోజూ జమా ఖర్చుల వివరాలను చెబుతుంటారు. ఉదయం సుప్రభాత సేవ ... తోమాల సేవ అనంతరం, భోగ శ్రీనివాసమూర్తిని సకల మర్యాదలతో స్నపన మంటపంలోని బంగారు సింహాసనంపై వేంచేపు చేస్తారు. స్వామివారికి షోడశ ఉపచారాలు నిర్వహించిన తరువాత, ఆలయ సిద్ధాంతి ఆనాటి తిథి వార నక్షత్రాలను గురించి చదివి వినిపిస్తారు.

అనంతరం రికార్డుల గది లెక్కల గుమస్తా స్వామివారికి వినయంగా నమస్కరిస్తాడు. స్వామివారికి వివిధ రూపాల్లో క్రితం రోజున వచ్చిన ఆదాయ వివరాలను చదివి వినిపించి, ఆ మొత్తాన్ని స్వామివారికి అప్పగిస్తున్నట్టుగా చెప్పి నమస్కరిస్తాడు. ఈ విధంగా కొలువు (దర్బార్)ను ఏర్పాటుచేసి ఈ తంతు జరపడం వలన ఈ శ్రీనివాసుడిని భోగ శ్రీనివాసుడనే కాకుండా కొలువు శ్రీనివాసుడని కూడా అంటుంటారు. దర్బార్ ముగిసిన తరువాత స్వామివారికి బెల్లంతో కలిపిన నువ్వుల పిండిని నైవేద్యంగా సమర్పించి, దానిని ప్రసాదంగా స్వీకరిస్తుంటారు.

More Bhakti Articles