రఘునాథపాలెం

రఘునాథపాలెం
ప్రేమ .. దయ .. జాలి .. కరుణ .. అనే మాటలకు శిరిడీసాయి ప్రతీకగా కనిపిస్తూ ఉంటాడు. మహిమలతో తన గొప్పతనాన్ని చాటుకోవాలని గానీ, పేరు ప్రతిష్ఠలు పెంచుకోవాలని గాని ఆయన ఏనాడూ ప్రయత్నించలేదు. దేవుడు ఒక్కడేనని చెబుతూ, ఆయనని చేరుకునే మార్గం దిశగా అందరినీ కలిసికట్టుగా నడిపించడానికి మాత్రమే కృషి చేసిన మహనీయుడాయన. తన భక్తుల బాధలను ... వ్యాధులను తాను స్వీకరించి, వారికి సుఖ శాంతులను ప్రసాదించిన దైవ స్వరూపుడాయన.

ఈ కారణంగానే ఈ రోజున ప్రతి గ్రామంలో సాయి మందిరాలు రూపుదాలుస్తూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో నిర్మితమైన సాయి సన్నిధానం మనకి ఖమ్మం జిల్లా 'రఘునాథపాలెం'లో దర్శనమిస్తుంది. ఇక్కడి సాయి మందిర నిర్మాణం చూస్తే, రాష్ట్రంలోని విశిష్ట సాయి మందిరాలలో ఒకటిగా కనిపిస్తుంది. సువిశాలమైన ఆలయ ప్రాంగణం ... అంతకుమించిన విశాలమైన ప్రదేశంలో రెండు అంతస్తుల సాయిమందిరం కనిపిస్తుంది. ఎటు చూసినా సాయి ప్రతిమలు వివిధ భంగిమలలో ఆనందాశ్చర్యాలను కలిగిస్తూ వుంటాయి.

ఆలయ ప్రాంగణంలో సాయికోటి స్థూపం ... స్థూపం చివరన విశ్వ ప్రేమను ఆవిష్కరిస్తోన్న సాయి ప్రతిమను చూసి తీరవలసిందే. ఇక ఇదే ప్రాంగణంలో ధుని ... వనసాయి మందిరం కూడా దర్శనమిస్తుంటాయి. ప్రధాన మందిరం ముఖద్వారంలో సాయిగణేశ ప్రతిమ కొలువై వుంటుంది. రెండవ అంతస్తులో విశాలమైన ముఖమంటపంలో వేదికపై సాయి కొలువుదీరి ఉంటాడు. ముఖమంటపంలోని స్తంభాలు ... పై కప్పు అందమైన నగిషీలతో అబ్బుర పరుస్తుంటాయి.

మొదటి అంతస్తులోగల ధ్యాన మందిరం విశాలంగా ... ప్రశాంతంగా కనిపిస్తుంటుంది. ఇక్కడ తులసికోటను పోలిన వేదికపై సాయి నటరాజుగా దర్శనమిస్తుంటాడు. ప్రతి గురువారం రోజున ... పర్వదినాల సమయంలోను ఇక్కడికి వచ్చే భక్తుల సంఖ్య ఎక్కువగానే వుంటుంది. ప్రతి ఏడాది గురుపౌర్ణమి ఉత్సవాలు ఇక్కడ విశేషంగా జరుగుతూ వుంటాయి.

More Bhakti Articles