వెలగొండ వేంకటేశ్వరుడు

వెలగొండ వేంకటేశ్వరుడు
శ్రీనివాసుడు ప్రకృతి ప్రేమికుడు ... అందువల్లనే అమ్మవారిని వెదుక్కుంటూ వైకుంఠం నుంచి వచ్చి తిరిగి వెనక్కి వెళ్లలేదు. భూలోకంలోని ప్రశాంతమైన ... పవిత్రమైన ప్రాంతాలను, ఆహ్లాదకరమైన వాతావరణంగల కొండప్రదేశాలను తన నివాసాలుగా మార్చుకున్నాడు. తన దర్శనం కోసం వచ్చే భక్తులను చిరునవ్వుతో పలకరిస్తూ ... వారి కోరికలను నెరవేరుస్తూ వెలుగొందుతున్నాడు.

అలా శ్రీ వేంకటేశ్వరుడు వెలసిన పరమ పవిత్రమైన క్షేత్రమే ఖమ్మం జిల్లా ముదిగొండ మండలంలోని 'అమ్మపేట'. ఇక్కడ కొండపై వెలసిన స్వామి వెలగొండ వేంకటేశ్వరస్వామిగా పూజలు అందుకుంటున్నాడు. పంటపొలాల మధ్య గల ఈ కొండని చూడగానే ఇది మహిమాన్వితమైన క్షేత్రమని అర్థమైపోతుంది. దూరం నుంచి చూస్తే ఈ కొండ ఏనుగు ఆకారంలో కనిపిస్తూ ... శ్రీవారి ఆలయాన్ని మోస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఈ కొండపై గల గుహలో వేంకటేశ్వర స్వామి పడుకుని వెలిశాడు.

ఈ శయన శ్రీనివాసుడిని దర్శించాలంటే భక్తులు కూర్చుని వంగుతూ గుహలోకి వెళ్లవలసి వుంటుంది. స్వామివారికి ఎడమవైపున అమ్మవారు కొలువై కనిపిస్తుంది. ఇక ఈ క్షేత్రంలోని మరో విశేషం ఏంటంటే స్వామి వారికి సంబంధించిన కోనేరుతో పాటు, వంటశాల ... యజ్ఞశాల ... పవళింపు సేవ జరిగే మందిరాలు రాళ్లతోనే సహజంగా ఏర్పడ్డాయి. భక్తులు స్వామివారి గర్భాలయంపై విమానాన్ని మాత్రమే నిర్మించారు. మిగతా అన్ని ఏర్పాట్లను ఆ శ్రీనివాసుడే చేసుకోవడం విశేషం.

ఒకప్పుడు ఇది అరణ్య ప్రాంతం కావడం వలన మానవ సంచారం తక్కువగా వుండేది. అందువల్ల వందల సంవత్సరాల క్రితం స్వామివారి ఉనికి బయటపడింది. నిజానికి ఇక్కడి స్వామివారు కొన్ని వేల సంవత్సరాల క్రితమే వెలిసినట్టు తెలుస్తోంది. త్రేతాయుగంలో సీతారాములు అరణ్యవాసం చేస్తూ, ఇక్కడి స్వామిని దర్శించుకున్నట్టుగా చెబుతారు. అందుకు నిదర్శనంగా ఇక్కడ సహజ సిద్ధంగా ఏర్పడిన సీతమ్మవారి పాదాలను చూపిస్తారు.

అమ్మవారు ... అయ్యవారు వెలసిన కారణంగానే ఈ గ్రామానికి 'అమ్మపేట' అనీ ... ఆ పక్కనే గల మరో గ్రామానికి 'వల్లభాపురం' అనే పేరు వచ్చిందని అంటారు. అయితే కాలక్రమంలో వల్లభాపురం వాడుకలో వల్లాపురంగా పిలవబడుతోంది. ఎందరో మహర్షులు ... మునులు కూడా స్వామివారిని దర్శించిన కారణంగానే, చూడగానే ఇది దివ్య క్షేత్రమని అనిపిస్తుందని స్థానికులు చెబుతుంటారు.

వెలగొండ వేంకటేశ్వరుడి అనుమతి ... ఆశీస్సులు లేకుండా ఇక్కడి వారు ఎలాంటి శుభకార్యాలను ప్రారంభించరు. ఇక్కడి స్వామి తనని నమ్మిన వారి వెంటే ఉంటూ కాపాడతాడని భక్తులు విశ్వసిస్తుంటారు. చైత్రశుద్ధ పౌర్ణమి సందర్భంగా స్వామివారికి అయిదు రోజుల పాటు ఉత్సవాలను నిర్వహిస్తుంటారు. ఈ సమయంలో స్వామి అశ్వ .. గజ .. శేష .. గరుడ .. మయూర .. సూర్య ప్రభ వాహనాలపై ఊరేగుతూ భక్తులకు కనువిందు చేస్తాడు. ఈ సందర్భంగా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామివారిని ... అమ్మవారిని దర్శించుకుంటూ వుంటారు. మొక్కుబడులు చెల్లించుకుంటూ ... కానుకలు సమర్పించుకుంటూ వుంటారు.

More Bhakti Articles