శ్రీ విశ్వేశ్వర క్షేత్రం

శ్రీ విశ్వేశ్వర క్షేత్రం
శివుడిగా ... శంకరుడిగా ... మల్లికార్జునుడిగా ... విశ్వనాథుడిగా ... విశ్వేశ్వరుడిగా ఆదిదేవుడు అనేక ప్రాంతాల్లో ఆవిర్భవించాడు. తన లీలా విశేషాలతో ... విన్యాసాలతో భక్తులను అనుగ్రహిస్తూ అనంతమైన పుణ్య ఫలాలను అందిస్తున్నాడు. అలా ఆ సదాశివుడు కొలువుదీరిన మరో క్షేత్రమే పుప్పాల్ గూడా. రంగారెడ్డి జిల్లా పరిధిలో గల ఈ క్షేత్రంలో స్వామి 'కాశీ విశ్వేశ్వరుడు' గా పూజలు అందుకుంటున్నాడు.

ఇక్కడి శివుడు ప్రాచీనకాలం నుంచి పూజలు అందుకుంటున్నట్టు స్థలపురాణాన్ని బట్టి తెలుస్తోంది. మహిమాన్వితమైన ఇక్కడి శివుడిని శ్రీ రాముడు కూడా పూజించినట్టు చెబుతారు. గోల్కొండ కోటలో బందీగా వున్న రామదాసుని విడిపించడానికి ముందుగా రామలక్ష్మణులు ఇక్కడి శివుడిని పూజించారని అంటారు. వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆలయం శిధిలావస్థకు చేరుకోగా దాతలు పునఃనిర్మించారు.

కొండపై కొలువైన విశ్వేశ్వరుడితో పాటు గణపతి ... సుబ్రహ్మణ్య స్వామి ... హనుమంతుడు ... నవగ్రహాలు పూజలు అందుకుంటూ వుంటారు. ఇక్కడి పుట్టలోగల నాగుపాము తరచూ గర్భాలయంలోని విశ్వేశ్వరుడిని దర్శించుకుని వెళుతుండటాన్ని స్థానికులు విశేషంగా చెబుతుంటారు. విశ్వేశ్వరుడిని పూజించిన వారు కష్టనష్టాల్లో నుంచి బయటపడతారనీ, ఆయురారోగ్యాలను పొందుతారని భక్తులు విశ్వసిస్తుంటారు.

మహా శివరాత్రి పర్వదినం సందర్భంగాను, కార్తీక మాసంలోను ఇక్కడ ప్రత్యేక పూజలు ... విశేష ఉత్సవాలు జరుగుతుంటాయి. ఈ సమయంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని ధన్యులవుతుంటారు.

More Bhakti Articles