సౌభాగ్యాన్ని ప్రసాదించిన సంబంధర్

సౌభాగ్యాన్ని ప్రసాదించిన సంబంధర్
తిరుజ్ఞాన సంబంధర్ ఊహ తెలిసిన నాటినుంచి శివారాధనపట్ల ఆసక్తిని చూపించాడు. అనుక్షణం శివుడిని దర్శిస్తూ ... స్పర్శిస్తూ ... పూజిస్తూ తరించేవాడు. శివనామ స్మరణలో పడి ఆకలిదప్పుల గురించి మరిచిపోయేవాడు. ఆయన పిలిస్తే శివుడు పలుకుతాడని చెప్పుకునే వారు. అయితే ఆయన మాత్రం ఓ సాధారణ భక్తుడిగానే నిరాడంబరంగా కనిపించేవాడు.

అలాంటి సంబంధర్ ఒకసారి వివిధ క్షేత్రాలను దర్శిస్తూ, అక్కడి శివుడిని భక్తితో ప్రస్తుతిస్తూ ఉండేవాడు. ఈ నేపథ్యంలో ఒకసారి ఆయన శివుడిని కీర్తిస్తూ పాడుకుంటూ శివాలయానికి బయలుదేరాడు. ఆ సమయంలో ఓ యువతీ పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన పాదాలపై పడింది. ఊహించని ఆ సంఘటనకి ఆయన బిత్తరపోయాడు. విషయమేమిటని ఆ యువతిని ఆప్యాయంగా అడిగాడు.

తనకి కొత్తగా పెళ్లి అయిందనీ ... భర్తతో కలిసి దైవ దర్శనానికి వచ్చానని చెప్పింది. కొంతసేపటి క్రితం తన భర్తను పాము కరవడం వలన మరణించాడంటూ కన్నీళ్ల పర్యంతమైంది. తన భర్త లేకుండా తాను ఇంటికి తిరిగివెళ్లనంటూ కూలబడిపోయింది. తన భర్తనైనా బతికించమనీ ... లేదంటే తన ప్రాణాలు తీసుకోమని పట్టుబట్టింది. ఆ యువతి కన్నీరు సంబంధర్ ను కదిలించి వేసింది.

పసుపు పారాణి ఆరకముందే ఆమెను వైధవ్యం వెదుక్కుంటూ రావడం ఆయనకి బాధకలిగించింది. వెంటనే మృత్యుంజయుడైన శివుడిని స్తుతిస్తూ రాగాన్ని అందుకున్నాడు. ఆ రాగాలాపనలో ఆయన తనని తాను మరచిపోయాడు. ఆయన భక్తికి మంచు ముక్కలా కరిగిపోయిన మహా శివుడు ఆ యువతి భర్తని అనుగ్రహించాడు. నిద్రపోయిన వ్యక్తిలా ఆ యువకుడు లేచి కూర్చున్నాడు.

అతని భార్యతో పాటు అక్కడున్న వారంతా ఈ దృశ్యం చూసి ఆశ్చర్యపోయారు. నూతన వధూవరులిద్దరూ సంబంధర్ పాదాలపై పడి ఆయనకి నమస్కరించారు. ఆయన మాత్రం అది తన గొప్పతనం కాదంటూ, శివయ్యకి కృతజ్ఞతలు తెలియజేశాడు.

More Bhakti Articles