సురభేశ్వర క్షేత్రం

సురభేశ్వర క్షేత్రం
సమస్త పాపాలను హరించివేయడంలోను ... సకల శుభాలను అందించడంలోను సదాశివుడు ఎప్పుడూ ముందే ఉంటాడు. ఈ కారణంగానే దేవతలు ... మహర్షులు మహా శివుడిని అనేక ప్రదేశాల్లో ప్రతిష్ఠించారు ... మనసారా పూజించారు. మానవాళికి కూడా దర్శనభాగ్యాన్ని అనుగ్రహించమని వారు కోరిన మీదటనే స్వామి ఆ ప్రదేశాల్లో ఆవిర్భవించాడు.

అలా జమదగ్ని మహర్షి కోరిక మేరకు శివుడు స్వయంభువుగా వెలసిన క్షేత్రమే ... 'శ్రీ సురభేశ్వర క్షేత్రం'. ఇది ప్రకాశం జిల్లా కంబం మండలంలోని 'తరిమెళ్ల' గ్రామంలో విలసిల్లుతోంది. పూర్వం ఇక్కడ జమదగ్ని మహర్షి ఆశ్రమం ఏర్పాటు చేసుకుని శివుడి గురించి తపస్సు చేశాడనీ, ఆయన అభ్యర్ధన మేరకే శివుడు ఇక్కడ వెలిశాడని స్థలపురాణం చెబుతోంది. దేవతలు పూజించిన కారణంగా ఇక్కడ స్వామిని సురభేశ్వరుడని పిలుస్తుంటారు.

ఇక ఇక్కడ నంది విగ్రహానికి సంబంధించిన ఆసక్తికరమైన కథ ఒకటి ప్రచారంలో వుంది. పూర్వం ఈ ప్రాంతంలో ఒక రైతు తన ఎద్దును విపరీతంగా కొట్టడంతో దాని కాలు విరిగిందట. అది ఆ బాధతో కుంటుకుంటూ నదిని దాటి మరీ ఇక్కడి శివాలయానికి వచ్చి, స్వామివారి ఎదురుగా కొన్ని రోజులపాటు కూర్చుని, ఆయననే చూస్తూ శరీరాన్ని వదిలివేసిందట. దాంతో గ్రామస్తులంతా కలిసి అక్కడే శిలపై దాని రూపాన్ని చెక్కించారు. ఈ కారణంగానే ఇక్కడి శివయ్యతో పాటు నందీశ్వరుడిని కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తుంటారు.

త్రేతాయుగానికి చెందిన ఈ క్షేత్రాన్ని చోళులు ... చాళుక్యులు ... కాకతీయులు ... విజయనగర రాజులు దర్శించుకున్నారు. ఈ రాజులంతా కూడా ఆలయ అభివృద్ధికి తమవంతు కృషి చేసినట్టుగా ఆధారాలు వున్నాయి. ఈ ప్రదేశంలో పాపనాశనం అనే మందిరం ఒకటి భక్తులకు దర్శనమిస్తుంటుంది. ఈ మందిరంలోని శివుడు పాపేశ్వరుడుగా పూజలు అందుకుంటున్నాడు. హరిహరరాయలు బ్రహ్మహత్యా పాతకం నుంచి బయటపడటం కోసం ఈ శివలింగాన్ని ప్రతిష్ఠించాడని అంటారు.

ప్రశాంతమైన వాతావరణంలో పవిత్రంగా కొలువుదీరిన ఈ క్షేత్రాన్ని దర్శిస్తే, అనంతమైన పుణ్య ఫలాలు ప్రాప్తిస్తాయని భక్తులు విశ్వసిస్తుంటారు. విశేషమైనటువంటి పుణ్య తిథుల్లో ఆ స్వామిని పదే పదే దర్శిస్తూ ... కానుకలు సమర్పిస్తూ తరిస్తుంటారు.

More Bhakti Articles