తులసీదాస్ కి పాదుషా పరీక్ష!

తులసీదాస్ కి పాదుషా పరీక్ష!
శ్రీరాముడి భక్తుడైన తులసీదాస్, నిరంతరం రాముడిని స్మరిస్తూ కీర్తిస్తూ ఉండేవాడు. రామాయణాన్ని పదే పదే పారాయణ చేస్తూ, రామ రసామృతాన్ని పానంచేస్తూ పరవశించే వాడు. ఆకలిదప్పులు ఎప్పుడో గాని ఆయనకు గుర్తుకు వచ్చేవికావు. అంతటా శ్రీ రాముడిని దర్శిస్తోన్న తులసీదాస్ భక్తి ప్రపత్తులు అందరినీ ఆశ్చర్యచకితులను చేయసాగాయి.

ఆయన మహా భక్తుడనే విషయం ఆనోటా ఈనోటా ఢిల్లీ పాదుషా చెవికి చేరింది. అంతటి భక్తుడిని తాను చూడాలని చెప్పి, తులసీదాస్ కి కబురుచేసి పిలిపించాడు. తులసీదాస్ భక్తి ప్రపత్తుల గురించి తాను విన్న విషయాలను గురించి ప్రస్తావించిన పాదుషా, ఆయన భక్తిని పరీక్షించాలని అనుకున్నాడు. ఆ ఉద్దేశంతోనే తనకి రాముడిని చూపించమని అడిగాడు. అందుకు కొత్త గడువు తీసుకున్నా ఫరవాలేదని చెప్పాడు.

దాంతో అసాధ్యమైన ఆ విషయాన్ని గురించి ఆలోచిస్తూనే, తులసీదాస్ అక్కడి నుంచి తన కుటీరానికి చేరుకున్నాడు. తనని ఈ గండం నుంచి గట్టెక్కించవలసిన బాధ్యత ఆ హనుమంతుడిదేనని అనుకున్నాడు. మరుక్షణమే హనుమంతుడు ప్రత్యక్షమై అయన చేయవలసిన పనిని గురించి చెప్పాడు. మరునాడు ఉదయం ఢిల్లీలో ఎక్కడ చూసినా కోతులు గుంపులు గుంపులుగా కనిపించసాగాయి. అవన్నీ కూడా పాదుషా భవన సముదాయం వైపు కదిలిరాసాగాయి.

విషయం తెలుసుకున్న పాదుషా, తాను తులసీదాస్ దగ్గర వ్యక్తం చేసిన కోరికకు ... ఈ కోతులకు ఏదో సంబంధం వుందని గ్రహించాడు. వెంటనే తులసీదాస్ కి కబురుచేసి రప్పించి, ఆయన రాగానే తండోప తండాలుగా వస్తోన్న కోతుల గురించి ప్రస్తావిస్తూ ఆందోళన వ్యక్తం చేశాడు. రాముడిని చూడాలనే ఆయన కోరికను తాను రాముడితో చెప్పాననీ, ఆయన బయలుదేరినప్పుడు సహజంగానే ముందుగా ఇలా వానర సైన్యం వస్తుందని పాదుషాతో తులసీదాస్ చెప్పాడు.

తనని మన్నించమనీ .... వెంటనే కోతులు వెనక్కి వెళ్లేలా చేయమని తులసీదాస్ ని కోరాడు పాదుషా. తులసీదాస్ హనుమంతుడిని ప్రార్ధించిన కొంతసేపటికే కోతులన్నీ కనిపించకుండా పోయాయి. అప్పుడు ఆయన గొప్పతనాన్ని తెలుసుకున్న పాదుషా, మనస్పూర్తిగా నమస్కరించి తగినరీతిన గౌరవించి పంపించాడు.

More Bhakti Articles