శ్రీ పైడితల్లి క్షేత్రం

శ్రీ పైడితల్లి క్షేత్రం
శ్రీ పైడితల్లి అమ్మవారు గ్రామదేవతగా పూజలు అందుకుంటున్న క్షేత్రం మనకి విజయనగరంలో దర్శనమిస్తుంది. విజయరామరాజు సోదరి అయిన పైడితల్లిని ఇక్కడి ప్రజలు దుర్గాదేవి అంశావతారంగా భావించి పూజిస్తూ వుంటారు. బొబ్బిలి యుద్ధంలో పాల్గొన్న తన సోదరుడు మరణించాడని తెలిసి తట్టుకోలేకపోయిన పైడితల్లి, తాను శరీరాన్ని వదలి వేస్తున్నానని గ్రామస్తులతో చెప్పిందట. పెద్ద చెరువులో తన మూర్తి శిలగా లభిస్తుందనీ, దానిని ప్రతిష్ఠించి పూజించమని ఆదేశించింది.

పైడితల్లి చెప్పిన ప్రకారమే జాలరులకి ఆ చెరువులో ఆమె ప్రతిమ లభించింది. ఆ రోజు నుంచి ఆమెకి పూజాభిషేకాలు నిర్వహిస్తూ వస్తున్నారు. పైడితల్లికి కష్టాలు చెప్పుకుంటే కనుమరుగైపోతాయని స్థానికులు చెబుతుంటారు. ప్రతి ఏడాది ఇక్కడ జరిగే 'సిరిమాను' ఉత్సవానికి భక్తులు లక్షలాదిగా తరలివస్తుంటారు. విజయదశమి తరువాత వచ్చే తొలి మంగళవారం రోజున ఈ సిరిమాను ఉత్సవం జరుగుతుంది. అమ్మవారు ఆలయ పూజారి కలలో కనిపించి సిరిమాను ఎక్కడ వుందనేది చెబుతుంది.

పూజారి ఆ చెట్టు జాడను కనుక్కుని, 40 - 50 అడుగుల పొడవుండే ఆ చెట్టును నియమ నిష్టలతో పూజిస్తాడు. ఆ తరువాత దానిని కొట్టేసి దుంగలా చెక్కిస్తారు. ఆ సిరిమాను చివరన పకడ్బందీగా ఏర్పాటు చేసిన పీఠంపై, అమ్మవారి ప్రతి రూపంగా పూజారిని కూర్చుండబెట్టి ఊరేగిస్తారు. ఇది గుడి నుంచి విజయరామరాజు కోట వరకూ మూడుసార్లు తిరుగుతుంది. రాజ వంశీకులను ఆశీర్వదించి, వారు సమర్పించిన కానుకలతో అమ్మవారు వెనుదిరుగుతుంది.

వందల సంవత్సరాలుగా జరుగుతోన్న ఈ ఉత్సవంలో ముందుగా 'పాలధార' అనే వాహనం ... ఆ తరువాత అయిదుగురు ముత్తయిదువులుగల 'అంజనరథం' ... అమ్మవారి ప్రతిమను వెలికి తీసిన జాలరుల 'వల' ... ఆ తరువాత సిరిమాను గల వాహనం నడుస్తుంటాయి. ఈ సమయంలో భక్తులు సిరిమాను పైకి నైవేద్యంగా రకరకాల పండ్లను విసురుతూ వుంటారు. ఈ ఉత్సవాల్లో భాగంగా అమ్మవారి ప్రతిమ లభించిన చెరువులో 'తెప్పోత్సవం' ఘనంగా నిర్వహిస్తూ వుంటారు. అమ్మవారిని దర్శించిన వారికి సకల శుభాలు కలుగుతాయని భక్తులు ప్రగాఢ విశ్వాసాన్ని ప్రకటిస్తూ వుంటారు.

More Bhakti Articles