పండరీపురం

పండరీపురం
శ్రీ పాండురంగస్వామి ఆవిర్భవించిన అత్యంత పవిత్రమైన ... ప్రాచీనమైన క్షేత్రాలలో 'పండరీపురం' మొదటిదిగా చెబుతుంటారు. ఇది మహారాష్ట్రలోని షోలాపూర్ జిల్లాలో దర్శనమిస్తుంది. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి అవతారమైన శ్రీ కృష్ణుడు, తన భక్తుడైన పుండరీకుడిని అనుగ్రహించిన కారణంగా ఈ క్షేత్రానికి పండరీపురమనే పేరు వచ్చిందని చెబుతుంటారు.

పుండరీకుడి తల్లిదండ్రులు శ్రీ కృష్ణుడి భక్తులు. వారి సంతానమైన పుండరీకుడు, ఊహ తెలిసిన నాటి నుంచి దైవ ధ్యానానికి దూరంగా ఉంటూ వ్యసనాలకు బానిస అయ్యాడు. వేశ్యాలోలుడై తల్లిదండ్రులతో పాటు భార్య మనసుకి కూడా కష్టం కలిగించాడు. ఆ తరువాత తన తప్పుతెలుసుకుని తల్లిదండ్రులకు సేవచేస్తూ శ్రీ కృష్ణుడి పాదాలయందు మనసు నిలిపాడు.

పుండరీకుడి భక్తికి మెచ్చిన కృష్ణుడు అతని ఆశ్రమానికి చేరుకుని వాకిట్లో నుంచుని పిలిచాడు. ఆ సమయంలో తండ్రికి పాదసేవ చేస్తున్న పుండరీకుడు, వచ్చింది ఎవరో చూడకుండానే కాసేపు ఆగమని చెప్పాడట. కాళ్లు కాలుతున్నాయని శ్రీ కృష్ణుడు చెబితే ఒక ఇటుక రాయి బయటికి విసిరి దానిపై నుంచోమని అన్నాడు. దాంతో ఇటుక పై నిలిచిన కృష్ణుడు అలాగే అక్కడ వెలిశాడు. భక్తుడిని అనుగ్రహించడం కోసం భగవంతుడు ఎంత కష్టమైనాపడతాడు అనే విషయాన్ని ఈ సంఘటన మరోసారి నిరూపించింది.

కాలాంతరంలో నామదేవుడు ... జ్ఞానదేవుడు ... తుకారాం ... గోరా ... పురందర దాసు ... మొదలైన భక్తులు పాండురంగ స్వామిని కీర్తిస్తూ తరించారు. ఈ కారణంగానే ఇప్పటికీ ప్రధాన ఆలయంలో స్వామి వారితో పాటు, ఆయన భక్తులంతా పూజలు అందుకుంటూ వుంటారు. ఇక్కడి గరుడ స్తంభాన్ని ఆలింగనం చేసుకున్న వారి కోరికలు నెరవేరతాయని అంటారు.

భక్తులు ముందుగా పుండరీకుడిని ... ఆ తరువాత నామదేవుడిని ... తుకారాం - జ్ఞానేశ్వర్ పాదుకలను ... భక్త చొక్కమేళను దర్శించుకుంటారు. ఆ తరువాత విఠలుడిని దర్శించుకుని ... గరుడ స్తంభాన్ని ఆలింగనం చేసుకుని ... ఆ పక్కనే కొలువైన రుక్మిణీ దేవిని పూజిస్తుంటారు. ఇక్కడి పాండురంగడు కోరిన వరాలను ప్రసాదిస్తాడనీ, మోక్షాన్ని అనుగ్రహిస్తాడని భక్తులు విశ్వసిస్తుంటారు. భజనలతో ... కీర్తనలతో ... ఆ స్వామిని ఆరాధిస్తూ, భక్తి సాగరంలో ఓలలాడుతుంటారు.

More Bhakti Articles