మిట్టపాలెం

మిట్టపాలెం
శ్రీ శిరిడీ సాయిబాబా ... శ్రీ అక్కల్ కోట మహరాజ్ ... శ్రీ మాణిక్యప్రభు ... శ్రీ గజానన మహరాజ్ ... శ్రీ వెంకయ్య స్వామి వంటి అవధూతలు కాలం పెట్టిన పరీక్షలను ఎదుర్కొని కారణజన్ములుగా ప్రసిద్ధి చెందారు. తమ గురించి తమకి ఏమీ పట్టనట్టుగా వ్యవహరిస్తూనే, చుట్టూ ఉన్నవారి కష్టాలను తొలగించడానికి ఎంతగానో పాటుపడ్డారు.

తమని విశ్వసించిన వారిని, విమర్శించిన వారిని సమదృష్టితో చూసిన ఘనత వారి సొంతం. తాము నివసిస్తోన్న గ్రామం బాగు కోసం ... ఆ గ్రామంలో నివసిస్తోన్న ప్రజలలోని మార్పు కోసం వారు తమదైన మార్గాన్ని అనుసరించారు ... జనం హృదయాల్లో దైవమై నిలిచి నిత్య పూజలు అందుకుంటున్నారు.

అలాంటి అవధూతల్లో 'శ్రీ నారాయణ స్వామి' ఒకరు. ఆయన సమాధి చెందిన ప్రదేశం ప్రకాశం జిల్లాలోని 'మిట్టపాలెం'లో దర్శనమిస్తుంది. నారాయణ స్వామి పూర్వ నామం కొండయ్య. చిన్నప్పటి నుంచి కూడా ఏదో ఆలోచిస్తున్నట్టుగా కనిపిస్తూ జరగబోయే సంఘటనల గురించి చెప్పేవాడట. నిజంగానే ఆయన చెప్పినట్టుగా జరుగుతుండటంతో ఆ గ్రామ ప్రజలకు ఆయన మాటలపై గురి కుదిరింది. సన్యాసిగా మారిన తరువాత ఆయన పేరు 'నారాయణ స్వామి' గా మారింది.

నారాయణస్వామి నిరాడంరమైన జీవితాన్ని గడుపుతూ, తనని నమ్మినవారికి ఎలాంటి ఆపదలు కలగకుండా చూసుకునే వాడు. ఆయన ప్రసాదంగా ఇచ్చిన విభూతి ... మిరియాలు స్వీకరించిన వారు, వ్యాధుల బారి నుంచి వెంటనే తేరుకునేవారు. ఆయన అనుగ్రహం కారణంగా స్త్రీలు సంతాన సౌభాగ్యాలను పొందేవారు. ఇక అప్పట్లో ఆ గ్రామంలో పాముల భయం ఎక్కువగా ఉండటంతో, 'సర్పయాగం' చేసి పాము అనేది కనిపించకుండా చేశాడట. గ్రామస్తులకు మేలు చేయడం కోసం ఆయన చేసిన పనులు ... మహిమలుగా ప్రచారాన్ని పొందాయి.

17 వ శతాబ్దంలో మహాశివరాత్రి పర్వదినం రోజున అయన 'మహా సమాధి' చెందాడు. అనుక్షణం తమ కోసం తపించిన ఆ మహనీయుడికి గ్రామస్తులు ఆలయం నిర్మించారు. నాటి నుంచి పూజాభిషేకాలు ... ఉత్సవాలు జరుగుతున్నాయి. శివరాత్రి రోజున ఆయన మహాసమాధి చెందిన సందర్భాన్ని పురస్కరించుకుని, వారం రోజుల పాటు ఘనంగా ఉత్సవాలను జరుపుతారు. ఇందులో భాగంగా జరిగే 'రథోత్సవం' చూసి తీరవలసిందే.

More Bhakti Articles