బాపట్ల సాయి మందిరం

బాపట్ల సాయి మందిరం
ఆదిదంపతులే తన తల్లిదండ్రులనీ ... ఈ లోకమే తన ఊరనీ ... మానవత్వమే తన మతమని చాటిచెప్పిన సద్గురువు శ్రీ శిరిడీ సాయినాథుడు. సర్వమతాలు సఖ్యతగా ఉండమనే చెప్పాయి అంటూ ఆయన అన్ని వర్గాలకు సంబంధించిన వేడుకలను సామూహికంగా జరిపించి, వారి మధ్య సోదరభావాన్ని పెంపొందింపజేశాడు.

ప్రతి ఒక్కరికి శ్రద్ధ - సహనం అవసరమంటూ వాటి యొక్క ప్రాముఖ్యతను వివరించి చెప్పాడు. తనని నమ్మినవారిని క్షణమైనా విడిచి వుండనంటూ, సమాధి నుంచే భక్తుల రక్షణ బాధ్యతను వహిస్తూ వస్తున్నాడు. ఈ కారణంగానే శిరిడీసాయి మనసు మనసుకు చేరువయ్యాడు ... మందిరాలలో మహాదేవుడైనాడు. అలా ఆయన కొలువుదీరిన మందిరం మనకు గుంటూరు జిల్లా 'బాపట్ల'లో దర్శనమిస్తుంది.

ఒకప్పుడు ఇక్కడ బాబా చిన్న మందిరంలో చిత్ర పటంగా దర్శనమిస్తూ ఉండేవాడు. ఈ బాబాను నమ్మిన వారికి అన్నిరకాలుగా మేలు జరుగుతూ ఉండటంతో దినదిన ప్రవర్ధమానమై నేడు ఒక మహా సంస్థానంగా దర్శనమిస్తోంది. విశాలమైన మంటపం ... అద్భుతంగా తీర్చిదిద్దిన వేదిక ... జీవకళ ఉట్టిపడే బాబా విగ్రహం మనసుకు హత్తుకుంటాయి. ఆలయ ప్రాంగణంలో ద్వారకామాయి మందిరం ... ధుని ... కనిపిస్తాయి.

ప్రతినిత్యం బాబాకి ఇక్కడ పూజాభిషేకాలు ... నాలుగు హారతులు ... జరుగుతుంటాయి. ఇక ప్రతి గురువారం భజనలు ... పల్లకి సేవ ... పవళింపు సేవను నిర్వహిస్తుంటారు. విశాలమైన ఈ మంటపంలో భక్తులు సాయి పారాయణం చేస్తూ ... సాయికోటి రాస్తూ కనిపిస్తుంటారు.

విజయదశమి రోజున అంటే బాబా సమాధి చెందిన రోజున ఇక్కడ విశేష పూజలు నిర్వహిస్తుంటారు. ఈ సందర్భంగా బాబాను దర్శించుకోవడానికి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఆయన అనుగ్రహాన్ని కోరుతూ తమ శక్తిమేర కానుకలు సమర్పించుకుంటూ వుంటారు.

More Bhakti Articles