సూర్య భగవానుడి క్షేత్రం

సూర్య భగవానుడి క్షేత్రం

సూర్య భగవానుడి క్షేత్రం
సృష్టిలోని సమస్త జీవులకు ఆధారమై నిలిచిన ప్రత్యక్ష దైవం సూర్యనారాయణుడు. ఆయన అనుగ్రహంతోనే జీవులు మనుగడ సాధించ గలుగుతున్నాయి. అలాటి సూర్యుడిని త్రిమూర్తి స్వరూపంగా పురాణాలు చెబుతున్నాయి. ఇందుకు ఉదాహరణగా నిలుస్తోంది అనంతపురం జిల్లాలోని 'బూదగవి' సూర్యనారాయణ స్వామి క్షేత్రం.

13 వ శతాబ్దంలో చోళ రాజులు స్వామివారికి ఆలయాన్ని నిర్మించారనడానికి ఆధారాలు వున్నాయి. గర్భాలయంలోని సూర్యనారాయణమూర్తి విగ్రహం ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తూ వుంటుంది. సూర్యుడి శిరస్సున ముఖం పై భాగంలో విష్ణుమూర్తిని సూచిస్తూ నిలువు నామం ... పరమశివుడిని సూచిస్తూ లింగాకారం ... బ్రహ్మను సూచిస్తూ అడ్డ నామం కనిపిస్తూ వుంటాయి.

ఇక సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు కనుక ఆయన ఆలయాలతో పాటు మిగతా ఆలయాలు కూడా తూర్పు దిక్కును చూస్తుంటాయి. అలాంటిది ఈ క్షేత్రంలో సూర్యుడు దక్షనాభిముఖంగా కనిపిస్తుంటాడు. దక్షిణ దిక్కుకు అధిపతి యమధర్మరాజు ... సాక్షాత్తు ఆయన సూర్యనారాయణమూర్తి కొడుకే కావడం వలన ఇది మరింత మహిమాన్వితమైన క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది.

ఇక్కడ హనుమంతుడు స్వామివారికి సాష్టాంగ నమస్కారం చేస్తూ కనిపిస్తాడు. హనుమంతుడికి సూర్యుడు గురువు ... ఆయన కూతురు సువర్చలను వివాహం చేసుకున్నాడు. అలాంటి హనుమంతుడు ఇక్కడ నమస్కార భంగిమలో దర్శనమిస్తుంటాడు. ఇలా ఇన్ని విశేషాలను సొంతం చేసుకున్న సూర్యనారాయణమూర్తి ఆలయం ఇదొక్కటేనని చెబుతుంటారు. ఇక్కడి స్వామివారిని దర్శించడం వలన వ్యాధులు ... బాధలు తగ్గుతాయనీ, అపమృత్యు భయం తొలగిపోతుందని భక్తులు విశ్వసిస్తుంటారు.

More Bhakti Articles