పుష్కరాలు

పుష్కరాలు
భారతదేశంలో నదులను దేవతలుగా భావించి ఆరాధించడమనేది ప్రాచీనకాలం నుంచి వస్తోంది. ఈ నదీ తీరాలలో ఎన్నో పుణ్యక్షేత్రాలు వెలసి ఆ జలాలను పుణ్య తీర్ధాలుగా మార్చాయి. కృష్ణ ... గోదావరి ... యమున ... గంగ ... కావేరి ... నర్మద ... సరస్వతి ... తుంగభద్ర ... తామ్రపర్ణి ... భీమరథి .. సింధూ .. ఇలా 12 నదులకి పుష్కరాలు వస్తుంటాయి.

గురువు ఒక రాశి నుంచి బయలుదేరి తిరిగి అదే రాశికి చేరుకోవడానికి పుష్కర కాలం పడుతుంది. ఆ సందర్భంలోనే ఒక్కో నదికి పుష్కరాలు వస్తుంటాయి. గురుడు కన్యారాశి లోకి ప్రవేశించినప్పుడు 'కృష్ణా పుష్కరాలు' వస్తాయి. ఈ పుష్కరాలకు విజయవాడ వేదికగా నిలుస్తుంది. ఇక గురుడు సింహరాశిలోకి ప్రవేశించినప్పుడు 'గోదావరి పుష్కరాలు' వస్తాయి. ఇవి రాజమండ్రిలో జరుగుతాయి.

గురుడు వృషభ రాశిలోకి ప్రవేశిస్తే 'నర్మదా నది'కి ... మిథున రాశిలోకి ప్రవేశిస్తే 'సరస్వతి నది'కి పుష్కరాలు వస్తాయి. గురుడు కర్కాటక రాశిలో ప్రవేశించినప్పుడు యమునా నదికి పుష్కరాలు వస్తాయి. ఈ పుష్కరాలు 'మధుర'లో జరుగుతాయి. ఇక గురుడు మేషరాశిలోకి ప్రవేశించినప్పుడు 'గంగానది'కి పుష్కరాలు వస్తాయి. ఈ పుష్కరాలు కాశీలోను ... హరిద్వార్ లోను జరుగుతుంటాయి. గురుడు తులారాశిలోకి ప్రవేశిస్తే 'కావేరి నది'కి పుష్కరాలు వస్తాయి. ఈ పుష్కరాలకు శ్రీ రంగం (తమిళనాడు )వేదికగా నిలుస్తుంది.

గురుడు వృశ్చిక రాశిలోకి ప్రవేశించినప్పుడు 'తామ్రపర్ణి'కి ... ధనూ రాశిలోకి ప్రవేశించినప్పుడు సింధూనదికి పుష్కరాలు వస్తుంటాయి. గురుడు మకరరాశిలోకి ప్రవేశించినప్పుడు 'తుంగభద్ర'కు ... కుంభరాశిలోకి ప్రవేశించినప్పుడు 'భీమరథి'నదికి పుష్కరాలు వస్తాయి. ఈ సమయాల్లో ఆయా నదుల్లో స్నానాలు ఆచరించడం వలన సమస్త పాపాలు నశించి పుణ్య ఫలాలు లభిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. ఈ కారణంగా పుష్కరాలకు లక్షలాది మంది తరలి వస్తుంటారు ... పుష్కర స్నానాలతో పునీతులవుతుంటారు.

More Bhakti Articles