గుంజీళ్ల గణపతి

గుంజీళ్ల గణపతి
వినాయకుడుకి తండ్రిలానే అభిషేకం అంటే మహా ఇష్టం ... ఇక నైవేద్యాల విషయంలో కూడా ఆ స్థాయిలోనే ఆయన ఆసక్తి చూపిస్తుంటాడు. పెద్దలు భక్తి శ్రద్ధలతో చేసే పూజల కన్నా ... పిల్లలు ఆడుతూ పాడుతూ చేసే పూజల పట్లనే ఆయన ఎక్కువ ప్రీతిని కనబరుస్తూ ఉంటాడు.

సాధారణంగా ఇతర ఆలయాల్లోకి వెళ్లగానే ప్రధాన దైవానికి భక్తి పూర్వకంగా నమస్కరిస్తుంటారు. అదే వినాయకుడి ఆలయానికి వెళితే మాత్రం 'గుంజీళ్లు' తీస్తుంటారు. అయితే వినాయకుడి ఎదురుగానే ఎందుకిలా గుంజీళ్లు తీయాలంటే అందుకు కారణం లేకపోలేదు. ఒకసారి కైలాసానికి వెళ్లిన విష్ణుమూర్తి, శంకరుడితో మాట్లాడుతుండగా వినాయకుడు ఆడుతూ అక్కడికి వచ్చాడు. విష్ణుమూర్తి చేతిలో గల చక్రం మెరుస్తూ కనిపించే సరికి చటుక్కున దానిని అందుకుని నోట్లో పెట్టుకున్నాడు.

విష్ణుమూర్తి ఎన్ని విధాలుగా అడిగినా వినాయకుడు ఆ చక్రం మాత్రం ఇవ్వడం లేదు. దాంతో విష్ణుమూర్తికి ఒక ఆలోచన వచ్చింది. వెంటనే వినాయకుడి ఎదురుగా గుంజీళ్లు తీయడం మొదలు పెట్టాడు. విష్ణుమూర్తి ఆ విధంగా చేయడం చూసి పకపకా నవ్వడం మొదలుపెట్టాడు వినాయకుడు.

ఆయనలా నవ్వగానే నోట్లోని సుదర్శన చక్రం కిందికి జారింది. వెంటనే ఆ చక్రాన్ని విష్ణుమూర్తి దొరకబుచ్చుకున్నాడు. అయితే ఆ రోజు నుంచి వినాయకుడికి గుంజీళ్లు ఎంతో ఇష్టమైనవిగా మారిపోయాయి. గుంజీళ్లు తీస్తూ వినాయకుడికి ఆనందాన్ని కలిగించి భక్తులు ఆయన అనుగ్రహం పొందుతుంటారు.

More Bhakti Articles