శ్రీ కూర్మం

శ్రీ కూర్మం
ఒకే గర్భాలయం ... గర్భాలయానికి ముందూ వెనుక ధ్వజ స్తంభాలు ... తూర్పు వైపు నుంచి పడమర వైపు తిరిగిన మూలమూర్తి ... ఇంతటి విశేషాలను ఆవిష్కరించిన ఆ పుణ్య క్షేత్రమే 'శ్రీకూర్మం'. వైష్ణవ క్షేత్రాలలో ముందువరుసలో నిలిచే ఈ క్షేత్రం శ్రీ కాకుళం సమీపంలో అలరారుతోంది. శ్రీ మహా విష్ణువు కూర్మావతారంలో వెలసిన కారణంగా ఇదే పేరుతో ఇక్కడ ఊరు ఏర్పడింది.

ఈ క్షేత్రం ఇక్కడ ఆవిర్భవించడానికి కారకులు శ్వేత చక్రవర్తి - విష్ణుప్రియ అనే వైష్ణవ భక్తులని పురాణాలు చెబుతున్నాయి. వంశోద్ధారకుడి కోసం విష్ణుప్రియ 'ఏకాదశి వ్రతం' చేస్తుండగా, ఆమెపై వ్యామోహంతో శ్వేత చక్రవర్తి కూడా ఆ ప్రదేశానికి బయలుదేరాడు. విషయాన్ని గ్రహించిన విష్ణుప్రియ తన వ్రత భంగం కాకుండా చూడమని స్వామిని ప్రార్ధించింది. దాంతో స్వామి ఆ దంపతుల మధ్య ఒక నదిని సృష్టించాడు. వంశాంకురం కోసం జరుగుతున్న వ్రతాన్ని పూర్తి చేయించడం కోసం ఏర్పడిన నది కనుక ఇది 'వంశోద్ధారక నది'గా పిలిపించుకుని, కాలక్రమంలో 'వంశాధార' గా మారింది.

ఆ తరువాత ఈ దంపతుల భక్తికి మెచ్చిన నారదుడు వీరిని ఒక పవిత్రమైన ప్రదేశానికి తీసుకు వెళ్లాడు. నారద మహర్షి కారణంగా అక్కడ వారికి కూర్మనాథ స్వామి దర్శన భాగ్యం లభించింది. ఆ దంపతులు కూర్మనాథ స్వామికి అక్కడ ప్రాణ ప్రతిష్ఠ చేసిన చాలా కాలానికి ఒక భిల్ల జాతికి చెందిన యువకుడు స్వామిని ఆరాధించడం మొదలు పెట్టాడు. గర్భాలయంలోని స్వామిని దర్శించుకోవడానికి ఆలయంలోకి అడుగుపెట్టిన అతణ్ణి అక్కడి వారు అడ్డుకుని అతనికి ఆలయ ప్రవేశం లేదని బయటికి గెంటేశారు.

దాంతో ఆ యువకుడు తన దురదృష్టానికి చింతిస్తూ గర్భాలయం వెనుక భాగానికి వెళ్లి ఆ గోడకి తల కొట్టుకోవడం మొదలు పెట్టాడు. దాంతో కరిగిపోయిన స్వామివారు తూర్పు వైపు నుంచి పడమర వైపుకి తిరిగారు. కంగారు పడిపోయిన పూజారులు తమ తప్పు తెలుసుకుని అతన్ని ఆలయంలోకి తీసుకు వచ్చారు. అయితే పడమర వైపుకి తిరిగిన స్వామి విగ్రహం అలాగే ఉండిపోవడంతో, ఆ వైపున కూడా ధ్వజస్తంభ ప్రతిష్ఠ చేశారు. అలా ప్రత్యేకతను ... ప్రాధాన్యతను సంతరించుకున్న ఈ క్షేత్రం దర్శనం మాత్రం చేతనే భక్తులకు ముక్తిని ప్రసాదిస్తుందని స్థలపురాణం చెబుతోంది.

More Bhakti Articles