కొల్లూరు మూకాంబిక

కొల్లూరు మూకాంబిక
త్రిమూర్తులకే శక్తిని ప్రసాదించిన పరాశక్తి, లోక కల్యాణం కోసం అనేక పేర్లతో అవతరించి తన భక్తులను కాపాడుతూ వచ్చింది. అలా ఆమె 'మూకాసురుడు' అనే రాక్షసుడిని సంహరించడం కోసం 'మూకాంబిక'గా అవతరించింది. పూర్వం 'కోల మహర్షి' శివుడి గురించి ఘోర తపస్సు చేశాడు. ఆది దేవుడు ప్రత్యక్షం కావడంతో ... అమ్మవారితో సహా త్రిమూర్తులు భూలోకాన ఆవిర్భవించాలని కోరాడు.

అందుకు శివుడు అంగీకరించడంతో ... అక్కడొక స్వయంభూ లింగం ఆవిర్భవించింది. ఆ లింగం పై మధ్య భాగంలో ఒక స్వర్ణ రేఖ వుంది. ఆ రేఖకు ఎడమ వైపున లక్ష్మీ .. దుర్గ ... సరస్వతి, కుడి వైపున తాను .. విష్ణువు ... బ్రహ్మ కొలువై ఉంటామని శివుడు చెప్పడంతో కోల మహర్షి సాష్టాంగ నమస్కారం చేశాడు. కోల మహర్షి కారణంగా ఈ ప్రాంతానికి 'కొల్లాపురం' గా పేరు వచ్చింది. కాలక్రమంలో అది 'కొల్లూరు'గా ప్రసిద్ధి చెందింది.

ఆ తరువాత కాలంలో పలు క్షేత్రాలను దర్శిస్తూ వస్తోన్న ఆది శంకరుల వారు, ఈ క్షేత్ర మహాత్మ్యాన్ని గుర్తించారు. లింగరూపంలో గుప్తంగా వున్న మూకాంబికా దేవికి ప్రత్యేక స్వరూపాన్ని కల్పించాలని అనుకున్నారు. అమ్మవారి సాక్షాత్కారం కలగడంతో, శ్రీ చక్రం పై ఆమె రూపాన్ని ఏర్పరిచారు. ఇప్పటికీ శంకరాచార్యుల వారు సూచించిన విధంగానే ఇక్కడ పూజాదికాలు నిర్వహిస్తుంటారు. మూకాంబిక ఉదయం వేళలో 'దుర్గ' గా ... మధ్యాహ్నం వేళలో 'లక్ష్మి' గా ... సాయంత్రం వేళలో 'సరస్వతి'గా భక్తులను అనుగ్రహిస్తుంటుంది.

More Bhakti Articles