మానస సరోవరం

మానస సరోవరం
మనసు నుంచి ఆవిర్భవించిన సరోవరం కనుక దీనిని 'మానస సరోవరం' అంటారు. ఆ మనసు మానవుడిది కాదు సాక్షాత్తు సృష్టి కర్త అయిన బ్రహ్మ దేవుడిది. బ్రహ్మ మానస పుత్రులు శివుడి సాక్షాత్కారం కోసం దాదాపు పుష్కర కాలం పాటు కైలాసగిరి దగ్గర తపస్సు చేశారు. వారి తపస్సుకు మెచ్చి పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమయ్యారు. అయితే ఆది దంపతులను పూజించడానికి వారికి అక్కడ నీరు లభించలేదు. దాంతో నీటి కోసం తమ తండ్రి అయిన బ్రహ్మదేవుడిని ప్రార్ధించారు.

అప్పుడు బ్రహ్మదేవుడు తన సంకల్పంతో సరోవరాన్ని సృష్టించాడు. బ్రహ్మదేవుడి మనసు నుంచి ఉద్భవించిన సరోవరం కావడం వలన ఇది మానససరోవరంగా ప్రసిద్ధి చెందింది. ఇందులోని నీరు స్వచ్ఛంగా ... తియ్యగా వుంటుంది. వాతావరణంలో వచ్చే మార్పులను బట్టి ఎప్పటికప్పుడు ఈ నీటి రంగు మారుతూ వుంటుంది. 'గంగా ' ... 'బ్రహ్మపుత్ర' ... 'సింధు' ... 'సత్లెజ్' నదుల జన్మస్థానం ఇక్కడికి 100 కిలోమీటర్ల పరిధిలోనే వుండటం విశేషంగా చెప్పుకోవలసిన విషయం.

పూర్వం ఈ సరోవర మధ్య భాగంలో జంబూ వృక్షాలు ఉండేవట. నాగ దేవతలు ఈ వృక్షాలపై తిరుగాడేవని అంటారు. ఈ చెట్టు పై నుంచి రాలిన పండ్లు సరోవరంలో పడటం వలన 'జం'అనే శబ్దం వచ్చేదట. అందువలన దీనిని 'జంబూద్వీపం' అని పురాణాలలో పేర్కొనడం జరిగింది. ''జంబూ ద్వీపే .. భరత వర్షే .. భరత ఖండే .. అంటూ మనం సంకల్పంలో చెప్పుకునే జంబూద్వీపం ఇదే. తన గర్భంలో పడిన వస్తువులను బంగారంగా మార్చే మహిమ ఈ సరోవరానికి వుందని అంటారు.

ఇక మానససరోవరం కూడా ఓ శక్తి పీఠమనీ ... సతీదేవి 'కుడి పాదం' ఇక్కడ పడిందని బావిస్తుంటారు. శివ నివాసంగా చెప్పబడుతోన్న కైలాస పర్వతానికి మానససరోవరం 18 కిలోమీటర్ల దూరంలో కనిపిస్తుంది. ఒకప్పుడు హంసలకు పుట్టినిల్లుగా చెప్పుకునే ఈ సరోవరంలో ఇప్పటికీ కూడా శివ గణాలు ... దేవతలు స్నానం చేస్తారని చెబుతారు.

సరోవరం చుట్టుకొలత 105 కిలోమీటర్లు. ప్రదక్షిణ పూర్వకంగా ఈ సరోవరాన్ని చుట్టి రావడానికి మూడు నాలుగు రోజులు పడుతుంది. ఈ ప్రదక్షిణా మార్గంలో అనేక జలప్రవాహాలు ... అక్కడక్కడా బౌద్ధ స్మారక స్తూపాలు కనిపిస్తాయి. ఈ నేపథ్యంలో ఉదయం ... మధ్యాహ్నం ... సాయంత్రపు వేళల్లో ఇక్కడి శిఖరాలు వెండి ... బంగారు ... రాగి రంగుల్లోకి మారుతుండటం అద్భుతంగా అనిపిస్తుంది.

ఇటు ప్రకృతి సౌందర్యాన్ని ... అటు ఆధ్యాత్మిక సౌందర్యాన్ని ఆవిష్కరించే మానస సరోవర యాత్ర ఒక జన్మకు సరిపడా ఆనందానుభూతులను ఇస్తుందనడంలో సందేహం లేదు.

More Bhakti Articles