జంబుకేశ్వరం

జంబుకేశ్వరం
కాలకూట విషాన్ని శివుడు కంఠంలో దాచుకున్నాడు. అగ్నిజ్వాల వంటి ఆ విష ప్రభావాన్ని తట్టుకోవడం కోసమే శివుడు ఎప్పుడూ చల్లదనాన్ని కోరుకుంటాడు. ఈ కారణంగానే ఆయన మంచు శిఖరాల నడుమ మహా ధ్యానంలో కూర్చుంటాడు. గంగను తలపై పెట్టుకున్నదీ ... జల సంబంధమైన క్షేత్రాలలో ఆవిర్భవించడానికి గల కారణం కూడా ఇదే. అలా ముక్కంటి వెలసిన పుణ్య క్షేత్రమే 'జంబుకేశ్వరం'. 'జలలింగం'గా ఆదిదేవుడు వెలసిన ఈ క్షేత్రం పంచభూత లింగాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది.

అత్యంత శక్తిమంతమైనదిగా చెప్పబడుతోన్న ఈ క్షేత్రం తమిళనాడు - తిరుచునాపల్లికి 11 కిలోమీటర్ల దూరంలో విరాజిల్లుతోంది. పూర్వం శంభుడు అనే శివభక్తుడు స్వామి కోసం కఠోర తప్పస్సు చేయగా సదా శివుడు ప్రత్యక్షమయ్యాడు. తాను ఎప్పటికీ స్వామివారిని చూస్తూ ఉండిపోవాలని శంభుడు కోరుకున్నాడు. అతను జంబూ వృక్షంగా మారతాడనీ, అతనికి ఎదురుగా తాను లింగరూపంలో వెలుస్తానని స్వామి మాట ఇచ్చాడు. ఇప్పటికీ ఈ జంబూ వృక్షాన్ని ఇక్కడ దర్శించవచ్చు. ఈ కారణంగానే స్వామివారికి జంబుకేశ్వరుడనీ ... ఈ క్షేత్రానికి 'జంబుకేశ్వరం' అనే పేరు వచ్చిందని స్థల పురాణం చెబుతోంది.

సుమారు అయిదు ఎకరాల ప్రదేశంలో ... అయిదు ప్రాకారాల నడుమ స్వామి కొలువుదీరి వున్నాడు. విశాలమైన ప్రాంగణం ... పొడవైన ప్రాకారాలు ... కళ్లు చెదిరే గోపురాలు ... అనేక ఉపాలయాలు ... మంటపాలు ... విస్మయులను చేసే శిల్పకళ ... జంబుకేశ్వరుడి వైభవానికి ప్రతీకలుగా కనిపిస్తూ వుంటాయి. ఈ ఆలయాన్ని 11 వ శతాబ్దంలో చోళరాజులు నిర్మించగా, ఆ తరువాత వచ్చిన పల్లవులు .. పాండ్యులు ... విజయనగర రాజులు అభివృద్ధి చేశారు.

గర్భాలయంలో 'జలలింగం' నుంచి నిరంతరం నీరు ఊరుతూనే వుంటుంది. ఇక అమ్మవారు 'అఖిలాండేశ్వరి' పేరుతో పూజలందుకుంటూ వుంటుంది. కార్తీక మాసంలో విశేష పూజలు ... మహా శివరాత్రి పర్వదినాన కల్యాణోత్సవం ... దేవీ నవరాత్రులు అంగరంగ వైభవంగా జరుగుతాయి. స్వామివారు వెలసిన తొలినాళ్లలో ఓ ఏనుగు ఆయనని పూజించినట్టు స్థల పురాణం చెబుతుంది. ఇప్పటికీ ఈ ఆనవాయతీ వుండటం విశేషంగా చెప్పుకోవాలి. మధ్యాహ్న సమయంలో ఆలయ సిబ్బంది క్షేత్రానికి చెందిన ఏనుగును గర్భగుడిలోకి తీసుకువస్తారు. అది స్వామివారిని పూలమాలలతో అలంకరించడం భక్తులు చూస్తూ మైమరచిపోతుంటారు.

More Bhakti Articles