అరుణాచలం

ఇటు తిరువణ్నామలైగా ... అటు అరుణాచలంగా ప్రసిద్ధి చెందిన ఈ క్షేత్రంలో, పంచభూత లింగాలలో ఒకటైన తేజోలింగం (అగ్నిలింగం) దర్శనమిస్తుంది. స్వామివారు అరుణాచలేశ్వరుడిగా ... అమ్మవారు అరుణాచలేశ్వరిగా పూజలందుకుంటొన్న ఈ క్షేత్రం తమిళనాడు - చెన్నై సమీపంలో విరాజిల్లుతోంది.

అరుణాచలం పరమ పవిత్రమైన పర్వత ప్రాంతం. దాదాపు 3000 అడుగుల లోపు ఎత్తుగల ఈ కొండపైకి నడకదారిలో చేరుకోవాలంటే నాలుగు గంటల సమయం పడుతుంది. అరుణాచలేశ్వరుడిని దర్శించడానికి ముందుగా చాలామంది 'గిరి ప్రదక్షిణ'చేస్తుంటారు. అయితే ఈ ప్రదక్షిణ ఒక గంటలో అయ్యేది కాదు ... ఎందుకంటే గిరి ప్రదక్షిణ మార్గం 18 కిలోమీటర్లు వుంటుంది. ఓపిక గలవారు నడచి ... లేనివాళ్లు వాహనాల్లో ఈ కార్యక్రమాన్ని పూర్తిచేస్తుంటారు.

ఆహ్లాదకరమైన వాతావరణంలో గిరి ప్రదక్షిణా మార్గంలోని శివాలయాలను దర్శించడం ఓ అనిర్వచనీయమైన అనుభూతిని కలిగిస్తుంది. కొండపై సుమారు 25 ఎకరాల ప్రదేశంలో పొడవైన ప్రాకారాల మధ్య ... ఎత్తైన రాజ గోపురాల మధ్య స్వామివారు కొలువై వుంటారు. అద్భుతమైన శిల్పకళ ఉట్టిపడే ప్రాకారాలలో పరివార దేవతలు కొలువుదీరి కనిపిస్తుంటారు. దేశ విదేశాల నుంచి వచ్చే భక్తులతో ఈ ప్రదేశం ఎపుడూ రద్దీగా వుంటుంది.

ప్రతి సంవత్సరం 'కార్తీక పౌర్ణమి' రోజున ఇక్కడ జరిగే 'దీపోత్సవం' చూసి తీరవలసిందే. 1000 కిలోల నెయ్యితో ... ఒక కిలోమీటరు పొడవుగల వత్తితో ఇక్కడ చేసే మహా దీపారాధన ఏకధాటిగా కొన్ని రోజులపాటు వెలుగుతుంది. ఇక రధోత్సవం చూడటానికి రెండు కళ్ళూ సరిపోవు. ఎంతోమంది మహారాజులు ... మహనీయులు ఇక్కడి స్వామివారిని దర్శించినట్టుగా చరిత్ర చెబుతోంది. అగ్నిలింగమై అవతరించిన స్వామివారు సర్వపాపాలను హరించి వేస్తాడని భక్తుల ప్రగాఢ విశ్వాసం.


More Bhakti News