మన్యం కొండ

మన్యం కొండ
శ్రీమన్నారాయణుడు తన భక్తులను కాపాడటం కోసం ... వారి పాపాలను నశింపజేసి మోక్షాన్ని ప్రసాదించడం కోసం అనేక పవిత్రమైన ప్రదేశాల్లో అవతరించాడు. అలాంటి పుణ్య క్షేత్రాలలో 'మన్యంకొండ'ఒకటి. ఇది మహబూబ్ నగర్ సమీపంలో అశేష భక్త జనకోటికి ఆహ్వానం పలుకుతూ అలరారుతోంది. దూరం నుంచి ఈ కొండను చూడగానే అది దైవ స్థానమనీ, పరమ పవిత్రమైనదని తెలిసిపోతుంది.

పూర్వం ఇక్కడ మునులు తపస్సు చేసుకుంటూ వున్న కారణంగా దీనిని 'మునులు కొండ' అని పిలిచేవారు. ఇక అప్పట్లో ఈ ప్రాంతం అరణ్యంలా వుండేది కాబట్టి 'మన్యం కొండ'గా ప్రచారంలో వుంది. ఈ క్షేత్రం తిరుమల క్షేత్రానికి నమూనాలా అనిపిస్తూ వుంటుంది. కొండ చిన్నదైనప్పటికీ అటు మెట్ల దారి ... ఇటు ఘాట్ రోడ్ ద్వారా పైకి చేరుకోవచ్చు.

ఏడు ద్వారాలు దాటుకుని వెళ్లి, కొండపై గుహలో ఆదిశేషుని పడగనీడలో లక్ష్మీ సమేతుడై వెలిసిన వేంకటేశ్వర స్వామిని దర్శించాలి. ఆ తరువాత కొండకి దిగువున గల ఆలయంలో అలివేలు మంగమ్మ అమ్మవారిని కూడా తప్పక దర్శించుకోవాలి. ఈ కొండకి ఒక వైపు నుంచి గల పాద ముద్రలు స్వామివారివేననీ ... ఆ వైపు నుంచి ఆయన కొండపైకి చేరుకున్నాడని అంటారు.

కొండ పైనుంచి చూస్తే స్థల పురాణానికి తగినట్టుగానే ప్రతి ఒక్కరికి తాము ఒక దివ్య లోకంలో ఉన్నట్టుగా అనిపిస్తూ వుంటుంది. తిరుమల లాగే ఇక్కడికి వచ్చిన భక్తులు తలనీలాలతో స్వామివారికి మొక్కుబళ్లు చెల్లిస్తుంటారు. ప్రతి సంవత్సరం మాఘ మాసంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు, ఫాల్గుణ శుద్ధ ఏకాదశిన అమ్మవార్ల నీరాజనోత్సవాలు నిర్వహిస్తుంటారు. ఈ ఉత్సవాలకి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తుంటారు.

More Bhakti Articles