రామగిరి

రామగిరి
రామాయణ ఘట్టాలు చోటుచేసుకున్న ప్రదేశాలను చూడాలనీ ... వాటి గురించి తెలుసుకోవాలనే కుతూహలం ప్రతి ఒక్కరిలోను వుంటుంది. ఎందుకంటే అందరి హృదయాలపై రామాయణం వేసిన ముద్ర అలాంటిది. అయితే కొన్ని ప్రదేశాల విషయంలో నిజంగానే అక్కడ రామాయణ ఘట్టాలు చోటు చేసుకున్నాయా? అనే సందేహం కలుగుతూ వుంటుంది. అలాంటి సందేహాలు తలెత్త కుండా 'బ్రహ్మ పురాణం'లోను ప్రస్తావించబడిన ప్రదేశమే 'రామగిరి'.

ఖమ్మం జిల్లాకి చెందిన పుణ్య క్షేత్రాలలో ఒకటిగా ఇది అలరారుతోంది. తండ్రి మాటకి కట్టుబడి శ్రీ రామ చంద్రుడు సీతా సమేతుడై అరణ్య వాసానికి వెళ్లాడు. అహర్నిశలు వారిని కనిపెట్టుకుని వుండటం కోసం లక్ష్మణుడు కూడా వెంటనడిచాడు. సీత ఒంటరిగా వున్న సమయంలో ఆమెను రావణుడు అపహరించి లంకా నగరానికి బయలుదేరాడు.

ఆకాశ మార్గాన సీతను తీసుకువెళుతోన్న రావణుడిని జటాయువు అనే పక్షి అడ్డుకుంది. ఆ ప్రయత్నంలో అది ప్రాణాలు కోల్పోతూ అటుగా వచ్చిన రామ లక్ష్మణులకు సీత ఆనవాళ్లు చెప్పింది. ఆ తరువాత శ్రీ రాముడికి హనుమ పరిచయం కావడం ... సుగ్రీవుడితో మైత్రి కుదరడం జరిగాయి. అయితే వర్షాకాలం కావడంతో రాముడు కొంత కాలం పాటు ఈ కొండపైనే వుండి పోయాడు.

ఆ సమయంలో రాముడు ... రావణుడితో యుద్ధానికి అవసరమైన శక్తి కోసం ఇక్కడే తపస్సును ఆచరించాడు. ఈ కారణంగానే ఈ ప్రదేశానికి 'రామగిరి' అనే పేరు వచ్చిందనీ, స్వామి యోగ రాముడిగా పిలవబడుతున్నాడని అంటారు. ఈ సంఘటనలు ఇక్కడే జరిగాయనడానికి గల ఆనవాళ్లు ఈ ప్రదేశంలో ఇప్పటికీ కనిపిస్తుంటాయి. పరిసర ప్రాంతాలకి గల పేర్లు ఈ నమ్మకాన్ని మరింత బలపరిచేలా వుంటాయి.

ఇది శ్రీరాముడు తిరుగాడిన పుణ్య భూమిగానే భక్తులు భావిస్తుంటారు. అందువల్లనే ఆయన పాద ధూళితో పవిత్రమైన ఈ ప్రదేశాన్ని దర్శిస్తూ పునీతులవుతుంటారు. ఈ క్షేత్రంలో 'శ్రీరామనవమి' ఉత్సవాలు వైభవంగా ... నయనానందకరంగా నిర్వహిస్తుంటారు.

More Bhakti Articles