కుంభకోణం

కుంభకోణం
తమిళనాడులోని 'కుంభకోణం'ఓ ఆధ్యాత్మిక కేంద్రమని చెప్పవచ్చు. ఇక్కడ ఎన్నో శివాలయాలు ... విష్ణాలయాలు ... మఠాలు ... పుష్కరిణిలు కనిపిస్తాయి. సంగీత సాహిత్యాలకు నెలవైన కుంభకోణం 108 వైష్ణవ దివ్య క్షేత్రాలలో ఒకటిగా విలసిల్లుతోంది. ఇక్కడి స్వామివారి చేతిలో ధనుస్సు వుంటుంది కనుక 'శారంగ పాణి పెరుమాళ్'అని పిలుస్తూ వుంటారు. ఇక అమ్మవారిని 'కోమలవల్లీ తాయార్'అనే పేరుతో కొలుస్తుంటారు.

గర్భాలయంలో స్వామివారు శయన విష్ణుమూర్తిగా దర్శనమిస్తుంటాడు. ఈ గర్భాలయం రథం ఆకారంలో రెండు వైపులా రెండు ద్వారాలను కలిగివుంటుంది. ఉత్తరాయణంలో ఉత్తరం వైపు ద్వారాన్ని తెరుస్తుంటారు. స్వామివారు ఇక్కడ కొలువై ఉండటానికి సూర్యుడు కారకుడని చెబుతుంటారు.

ఒకసారి తన కన్నా తేజస్సుతో వెలిగిపోతున్న సుదర్శన చక్రం చూసి, సూర్యుడు తన శక్తిని కూడా పెంచాడట. ఫలితం లేకపోగా ఆ ప్రయత్నంలో అతని శక్తి నశించి తేజస్సును కోల్పోయాడు. మన్నించమంటూ శ్రీ మహా విష్ణువును వేడుకుని, కోల్పోయిన తేజస్సును తిరిగి పొందాడు. సూర్యుడు ప్రార్ధన కారణంగా శ్రీ మహా విష్ణువు ఇక్కడ శారంగపాణిగా వెలిశాడని స్థల పురాణం చెబుతోంది. ఈ కారణంగా ఈ క్షేత్రం ...'భాస్కర క్షేత్రం'గా కూడా ప్రచారంలో వుంది.

శారంగపాణికి నాయక రాజులు ఆలయమును నిర్మించినట్టు శాసనాల ద్వారా తెలుస్తోంది. గాలిగోపురం 160 అడుగుల ఎత్తులో 12 అంతస్తులను కలిగి వుంటుంది. ఇక చక్రపాణి - విజయవల్లి ఆలయంలోని స్వామి వారి చేతిలో 'సుదర్శన చక్రం'చూసి తీరవలసిందే. ఇక్కడి కోనేరు దాదాపు 20 ఎకరముల వరకూ విస్తరించి వుంటుంది. కోనేరుకు నాలుగువైపులా మెట్లు ... మంటపాలు కనిపిస్తాయి. మాఘ మాసంలో జరుగు బ్రహ్మోత్సవాలకు భక్తులు అత్యధిక సంఖ్యలో వస్తుంటారు.

More Bhakti Articles