మధుర

మధుర
అమ్మ ఎక్కడ వుంటే అక్కడ ఆదరణ .. ఆప్యాయత ... అనురాగం వుంటాయి. అమ్మ ఎక్కడ వుంటే అక్కడ అభయమే తప్ప ఆకలి ... ఆందోళన వుండవు. అలాంటి అమ్మగా అశేష భక్త జనకోటిని అనుగ్రహిస్తోంది మధుర మీనాక్షి. త్రిశక్తి స్వరూపిణి కంచి కామాక్షి ... మధుర మీనాక్షి ... కాశీ విశాలాక్షిగా పూజలు అందుకుంటోంది. వీరిలో మధుర మీనాక్షి మనసు మంచు వంటిదని అంటూ వుంటారు. ఇక్కడ సదా శివుడు ... సుందరేశ్వరుడిగా దర్శనమిస్తుంటాడు.

తమిళనాడులోని ఈ పుణ్య క్షేత్రం పురాణాల్లో 'మధుర పురం' అనే పేరుతో కనిపిస్తుంది. పాండ్య రాజుల కాలంలో మధుర దక్షణ భారతానికి రాజధానిగా వెలుగొందింది. విశ్వనాథ నాయకుడు ... ఆయన వంశీకులు ఈ ప్రాంతాన్ని చాలాకాలం పాటు పరిపాలించారు. ఆలయ అభివృద్ధిలో వీరు కీలకమైన పాత్రను పోషించారు. విశాలమైన ఆలయ ప్రాంగణం ... నలు దిక్కులా ఎత్తయిన రాజ గోపురాలు ... అద్భుతమైన శిల్పకళా నైపుణ్యం ... అనేక ఉపాలయాలు ... స్వర్ణ పుష్కరిణి ... మధుర వైభవానికి మచ్చుతునకలా కనిపిస్తుంటాయి.

ఇక్కడి వెయ్యికాళ్ల మంటపం ... వాటిపై చెక్కిన శిల్పాలు చూపు మరల్చనివ్వకుండా చేస్తాయి. నిర్మాణ పరంగా ... అమ్మవారి అనుగ్రహం పరంగా ఈ క్షేత్రం ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ప్రతి నిత్యం ఉత్సవాలు జరుగుతుండటం వలన ... దేశ విదేశాల నుంచి భక్తులు వస్తుండటం వలన ఈ ఆలయం చాలా రద్దీగా వుంటుంది. విశేష పూజలు ... ప్రత్యేక ఉత్సవాలు ఘనంగా జరుగుతూ వుంటాయి. ఇక నవరాత్రి ఉత్సవాలు జరిగే తీరు చూడాలేగానీ చెప్పడానికి మాటలు చాలవు.

More Bhakti Articles