ఘుశ్మేశ్వర

ఘుశ్మేశ్వర
మహారాష్ట్ర - ఔరంగాబాద్ లోని 'శివాలయ'అనే ప్రదేశంలో ఈ జ్యోతిర్లింగం ఆవిర్భవించింది. ఇక ఈ క్షేత్రానికి ఈ పేరు రావడానికి గల కారణాన్ని శివపురాణం ప్రస్తావిస్తోంది. పూర్వం దేవగిరి ప్రాంతంలో సుధర్ముడు - సుదేహ అనే బ్రాహ్మణ దంపతులు నివసించేవారు. ఆ దంపతులు నిత్యం శివుడిని ఆరాధిస్తూ ... అతిథులను సేవిస్తూ కాలం గడపసాగారు. తనకి సంతాన యోగం లేదని తెలుసుకున్న సుదేహ ఇటు తన భర్త సుధర్మను అటు తన చెల్లెలు ఘుశ్మను ఒప్పించి ఇద్దరికీ వివాహం జరిపిస్తుంది.

శివ భక్తురాలైన ఘుశ్మ ప్రతి నిత్యం ఇసుకతో శివలిగాలను చేసి పూజించి, ఆ తరువాత వాటిని కోనేరులో కలిపేసేది. శివానుగ్రహం కారణంగా ఘుశ్మకి ఓ మగపిల్లవాడు జన్మించడంతో సుదేహ కూడా ఆనందంతో పొంగిపోతుంది. కాలక్రమంలో సుధర్ముడు - ఘుశ్మ మనవడిని కూడా ఎత్తుకుంటారు. వాళ్ల ఆనందం సుదేహలో అసూయకి కారణమవుతూ వస్తుంది. అది కాస్తా ద్వేషంగా మారడంతో ఘుశ్మ మనవడిని సుదేహ అనేక ఖండాలుగా చేసి ఆ రాత్రే కోనేరులో విసిరేస్తుంది.

మరుసటి ఉదయం ఇసుకతో శివలింగాలు చేస్తోన్న ఘుశ్మ దగ్గరికి ఆమె కోడలు పరిగెత్తుకు వచ్చి జరిగిన ఘోరం గురించి వివరిస్తుంది. ఆ పరమేశ్వరుడు తమకి ఎప్పుడూ అన్యాయం చేయడంటూ తాపీగా ఘుశ్మ తన పూజా కార్యక్రమాన్ని పూర్తి చేస్తుంది. ఆమె భక్తికి ... అచెంచలమైన ఆమె విశ్వాసానికి పరమశివుడు మెచ్చి ప్రత్యక్షమవుతాడు. ఘుశ్మకి ఆమె మనవడిని సజీవంగా అప్పగించడమే కాకుండా, తాను వెలసిన ఈ క్షేత్రం ఆమె పేరుతో ప్రసిద్ధి చెందుతుందని వరమిచ్చాడు. నాటి నుంచి ఇక్కడి సదాశివుడు ... ఘుశ్మేశ్వరుడిగా పూజలు అందుకుంటున్నాడు.

గర్భాలయంలోని స్వామివారికి ఇప్పటికీ ఈ కోనేరు నీటితోనే అభిషేకం చేస్తారు. స్వామివారి వెనుక అమ్మవారు కొలువుదీరి కనిపిస్తూ వుంటుంది. ఆలయ ప్రాంగణంలోని లక్ష్మీ గణపతిని ముందుగా దర్శించిన తరువాతే ఇక్కడి స్వామివారిని దర్శించాలి. ఇక మహా శివరాత్రి పర్వదినం రోజున శివపార్వతులకు నిర్వహించే కళ్యాణ మహోత్సవం నయనానందకరంగా వుంటుంది.

More Bhakti Articles